MIM | వెయ్యి కోట్ల విరాళాలు సేకరించి MIM సత్తా చాటుతాం.. కరీంనగర్ గడ్డపై ఆకుపచ్చ జెండా ఎగురవేస్తాం..!
MIM, KARIMNAGAR తెలంగాణలో బిజెపి గెలువకుండా నిలువరించే దమ్ము, బలం ఎంఐఎంకే ఉంది తెలంగాణలో హిందూ, ముస్లిం అనే వివాదాలు, ఘర్షణలు ఎంఐఎం కృషితోనే తగ్గుముఖం పెండింగ్ సమస్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ను కలువబోతున్నాం ఈద్ మిలాప్లో నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు విధాత బ్యూరో ,కరీంనగర్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ ఆశావహులు మేము 100 కోట్లు […]

MIM, KARIMNAGAR
- తెలంగాణలో బిజెపి గెలువకుండా నిలువరించే దమ్ము, బలం ఎంఐఎంకే ఉంది
- తెలంగాణలో హిందూ, ముస్లిం అనే వివాదాలు, ఘర్షణలు ఎంఐఎం కృషితోనే తగ్గుముఖం
- పెండింగ్ సమస్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ను కలువబోతున్నాం
- ఈద్ మిలాప్లో నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు
విధాత బ్యూరో ,కరీంనగర్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ ఆశావహులు మేము 100 కోట్లు ఖర్చు పెట్టైన గెలిచి తీరుతామని అవాకులు, చెవాకులు పేల్చుతున్నారని, ఎంఐఎం పార్టీ కూడా తక్కువేమీ కాదని, తమ అధిష్టానం ఆదేశించి ఏ అభ్యర్థినైనా పోటీలో ఉండాలని ప్రకటిస్తే, విశ్వవ్యాప్తంగా ఉన్న ఎంఐఎం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అవసరమైతే తాము 1000 కోట్ల విరాళాలు సేకరించి సత్త చాటుతామని, కరీంనగర్ గడ్డపై ఎంఐఎం జెండాను నిక్కచ్చిగా ఎగురవేస్తామని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం రాత్రి ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో గులాం అహ్మద్ హుస్సేన్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమరం కోసం 2018లో నుండే కసరత్తు చేస్తున్నామని, ఎంఐఎం పార్టీ నేతల చిత్తశుద్ధి, పనితనం తోనే నేడు 35 డివిజన్లలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీని గెలవకుండా నిలువరించే దమ్ము ధైర్యం, సత్తా కేవలం ఎంఐఎం పార్టీకే ఉందన్నారు. తెలంగాణలో గడచిన 9సంవత్సరాలలో హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలు, వివాదాలు సమసిపోవడానికి ఎంఐఎం పార్టీ కృషియే కారణమన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషి వల్లనే నేడు కరీంనగర్ స్మార్ట్ సిటీగా శరవేగంగా రూపాంతరం చెందిందన్నారు.
కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి, కోట్లాది రూపాయల నిధులను సమకూర్చిన ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే నిధులతో ముస్లిం డివిజన్లలో అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని, ఎందుకంటే ఎంఐఎం పార్టీ మద్దతుతో, ముస్లింల కష్టార్జితంతో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు గెలిచి నేడు ఎంఐఎం పార్టీ పట్ల, ముస్లిం డివిజన్ల పట్ల చూసి చూడనట్లు, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, దమ్ముంటే ఎంఐఎం మద్దతు లేకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని సవాల్ విసిరారు.
బిఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయినటువంటి బిజెపి అభ్యర్థి మీడియా ఎదుట ఎన్నికల ఫలితాల రోజు ఈగెలుపు ఎంఐఎం పార్టీదని, బీఆర్ఎస్ అభ్యర్థిది కాదని చెప్పలేదా అని ప్రశ్నించారు. ముస్లిం డివిజన్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోగా, తూతూ మంత్రంగా కొద్ది పనులు మాత్రమే చేసి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల, 2019 పార్లమెంట్ ఎన్నికల రిపోర్ట్ను తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
కరీంనగర్ లో పెండింగులో ఉన్న సాలెహ్ నగర్, చింతకుంట ఈద్గాల సమస్యలు, ముస్లిం కమ్యూనిటీ హల్ నిర్మాణం, ముస్లిం షాదీఖానలో క్రాకరి, బైపాస్ రోడ్ లో మోడల్ ఖబ్రస్థాన్ అభివృద్ధి, కశ్మీర్ గడ్డ, ముకరంపుర, గోదాంగడ్డలోని ముస్లింల కోసం నూతన ఖబ్రస్థాన్ కోసం భూమి, జిల్లా వ్యాప్తంగా ఉర్దూ రెండవ బాషా అమలు, నగర వ్యాప్తంగా కాలనీల సూచిక బోర్డు లపై పేర్లు ఉర్దూలో వ్రాయించాలని, తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో త్వరలో సీఎం కేసీఆర్ ను కలవబోతున్నట్లు పేర్కొన్నారు. కొందరు మైనారిటీ అసమర్ధ నాయకుల పిచ్చి ప్రేలాపనలు, ఆలోచనలతోనే బిఆర్ఎస్, ఎంఐఎంల మధ్య దూరం పెరిగిందన్నారు. తమకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
గత రెండు దశాబ్దాల క్రితం కొందరు ఎంఐఎం పార్టీ రాజకీయ ప్రత్యర్ధులు, ఎంఐఎం పార్టీ పాతబస్తీకే పరిమితమని, నయాపూల్ అవతలి పార్టీ అని, రిక్షావాలా పార్టీ అని ఎద్దేవా చేశారని, కానీ నేడు ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా 14రాష్ట్రాలలో విస్తసరించి, సర్వజనుల సమస్తహితం కోసం పోరాడే పార్టీగా అవతరించిందన్నారు. ఎంఐఎం పార్టీని విమర్శించిన వాళ్లు ఇప్పుడు వారి తలలను ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఈద్ మిలాప్ సందర్భంగా షీర్ ఖుర్మా పాయసాన్ని పార్టీ నాయకులకు అందజేశారు.
ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, ఖమరుద్దీన్, కోశాధికారి ఇబ్రహీం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఫిరోజ్ అఖీల్, కార్పొరేటర్ శర్ఫుద్దీన్, నాయకులు ఆతిన, ఎండి, సాజిద్, సాజిద్ మాజిద్, ఇస్మాయిల్, ఫసియుద్దీన్ ఖాలీద్, షాకిర్ నహ్ది, ఆమెర్ ఖురేషి, బాస్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.