తప్పిదాలకు బాధ్యతగా హరీశ్‌రావు రాజీనామా చేయాలి

బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు వాదిస్తున్నారని, అవినీతి జరిగిందో లేదో మాజీమంత్రి హరీశ్‌ రావు ఆత్మసాక్షిగా చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

  • By: Somu    latest    Feb 17, 2024 11:34 AM IST
తప్పిదాలకు బాధ్యతగా హరీశ్‌రావు రాజీనామా చేయాలి
  • మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్


విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు వాదిస్తున్నారని, అవినీతి జరిగిందో లేదో మాజీమంత్రి హరీశ్‌ రావు ఆత్మసాక్షిగా చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సాగునీటి రంగం శ్వేతపత్రంపై చర్చలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై జూపల్లి మండిపడ్డారు. నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆరెస్‌ ప్రభుత్వం తప్పిదాలు చేసి బుకాయిస్తుందన్నారు.


నీటిపారుదల రంగంలో రూ.1.8 లక్షల కోట్లతో టెండర్లు చేపట్టారని చెప్పారని, అంచనాలు పెంచడంలో లోగుట్టు మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని.. ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటారని నిలదీశారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదుగా? అని ప్రశ్నించారు. ఆత్మసాక్షి ఉంటే ఇన్ని భారీ తప్పులకు పాల్పడిన హరీశ్‌రావు రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.