ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దుకాణం బంద్

పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ బీఆరెస్‌ దుకాణం బంద్ అవుతదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దుకాణం బంద్
  • వచ్చే ఎన్నికల్లో 64 పోయి..124 అవుతాం.. వచ్చేసారి సీట్లు పెరుగుతాయి
  • మా ప్రభుత్వం పడిపోవడం కాదు..మీ పార్టీని కాపాడుకోండి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విధాత, హైదరాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ బీఆరెస్‌ దుకాణం బంద్ అవుతదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోమటిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. కుర్చీ వేసుకుని కూర్చుని నల్లగొండ జిల్లా ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఒక్కనాడు ఇటు రాలేదని, జిల్లాలోఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్శించారు. ఇంత పాపాత్ముడు కేసీఆర్ ఎప్పుడు కూడా లేవవద్దన్నారు. రేవంత్ ముఖం చూడలేక..రేవంత్ తిట్లకు, నా తిట్లకు భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కట్టే పట్టుకుని తిరుగుతుండని విమర్శించారు.


బావ, బామ్మర్డులకు ఏం తోయక ప్రభుత్వం పడిపోతదని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా వారి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆరెస్‌లో నుంచి ఖాళీ అవుతున్న సంగతి చూసుకోవాలన్నారు. బీఆరెస్ నుంచి పోయేటోల్లను ఆపేందుకు కారు సర్వీసింగ్‌కు పోయిందని కేటీఆర్ చెబుతున్నడని, సర్వీసింగ్ పోలేదని, స్క్రాబ్ షెడ్ కి పోయిందని తిరిగి రాదని ఎద్దేవా చేశారు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా కలిసి పని చేసి ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 64 పోయి..124 అవుతామని, వచ్చేసారి సీట్లు పెరుగుతాయన్నారు. నేను అన్ని పదవులు అనుభవించానని, జిల్లాలో పదవుల రేసులో మొదటి వరుసలో ఉన్నదేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్‌కు దేవుని దయతో మంచి పదవి వస్తుందన్నారు. మేమంతా కొత్త వారికి సహరిస్తామన్నారు. ఎర్రజెండా మీద గెలిచిన బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గతంలో వంద కోట్లకు అమ్ముడు పోయాడని విమర్శించారు. ఆయన పెట్టిన క్రషర్ కూడా పోతదన్నారు.


నల్గొండ, భువనగిరి ఎంపీలుగా పోటీకి బీఆరెస్‌ పార్టీకి అభ్యర్థులు కూడా లేరన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి దేవరకొండ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలన్నారు. దేవరకొండ నియోజక వర్గంలో మొత్తం 40 కోట్ల వ్యయంతో రోడ్ల మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రోడ్లు, భవనాలు నిధుల నుండి 20కోట్లతో కొండమల్లేపల్లి నుండి గుర్రంపోడు వరకు జాతీయ రహదారి పనులు మొదలు పెట్టినామని తెలిపారు. దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సొంతంగా 50 లక్షలు ఇస్తున్నానని, ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.