పోరు మాని.. వీధిన పడ్డ మిర్యాలగూడ కాంగ్రెస్!
కేంద్రంపై పోరు మాని.. కాంగ్రెస్ వర్గాల బాహాబాహి ! ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. విధాత: కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ప్రైవేటీకరణ చర్యను వ్యతిరేకిస్తూ ధర్నాకు సిద్ధపడిన మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 'గుణం మారదురా గువ్వల చెన్న' అన్నట్లుగా పార్టీ కార్యాలయంలోనే పరస్పరం బాహాబాహికి దిగి అంతర్గత కలహాలను వీధి కెక్కించారు. డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగి […]

- కేంద్రంపై పోరు మాని.. కాంగ్రెస్ వర్గాల బాహాబాహి !
- ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..
విధాత: కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ప్రైవేటీకరణ చర్యను వ్యతిరేకిస్తూ ధర్నాకు సిద్ధపడిన మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘గుణం మారదురా గువ్వల చెన్న’ అన్నట్లుగా పార్టీ కార్యాలయంలోనే పరస్పరం బాహాబాహికి దిగి అంతర్గత కలహాలను వీధి కెక్కించారు.
డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. సోమవారం ఏఐసీసీ పిలుపుమేరకు స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
ధర్నా విషయంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ ఏకపక్షంగా ధర్నా కార్యక్రమం చేపట్టారని బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు శంకర్ నాయక్ తో పాటు ఆయన వర్గీయులను నిలదీశారు. వారి వాగ్వాదంతో అర్థంతరంగా ధర్నా ముగించుకున్న ఇరువర్గాలు అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. అక్కడ హాత్ సే హాత్ జోడో పోస్టర్ ఆవిష్కరణ విషయమై బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయకులు చర్చిస్తుండగానే రెండు వర్గాల మధ్య మాటా మాటా ముదిరి ఘర్షణకు దిగారు.
పరస్పరం బాహబాహికి దిగి బట్టలు చింపుకొని, కుర్చీలు విసురుకొని, పార్టీ ఆఫీస్ ఫర్నీచర్ విసిరేసి రచ్చ రచ్చ చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజల్లో పార్టీ కార్యకలాపాలను ఏకతాటిపై నడిపించడంలో విఫలమవుతూ తమకు అలవాటుగా మారిన వర్గపోరుతో జనంలో పలుచనవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో ఇంకా పోకపోవడం పట్ల స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.