సీఎం రేవంత్ భాషా ఆయన నైజానికి దర్పణం: ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి

మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు అధికారమిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మార్పు తిరోగమనం వైపు సాగుతుందని

సీఎం రేవంత్ భాషా ఆయన నైజానికి దర్పణం: ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి
  • మార్పునా….తిరోగమనమా
  • రైతుల పేగులు మెడలో వేసుకుంటున్నారు
  • ఢిల్లీ పర్యనలు మాని..కరవు పర్యటనలు చెయ్‌
  • తక్షణమే వ్యవసాయ, ఇరిగేషన్ రంగాల సమీక్షలు పెట్టాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఫైర్
  • గుత్తా అమిత్‌రెడ్డి టికెట్ ఎవరు అడ్డుకోలేదు

విధాత, హైదరాబాద్‌ : మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు అధికారమిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మార్పు తిరోగమనం వైపు సాగుతుందని బీఆరెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైందని, ఇది తక్కువ కాలం ఏమి కాదన్నారు. ఎంత సేపు మేం చేసిన పనులకు ప్రారంభోత్సవాలు, మేం నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీచేసుకుని చెప్పుకోవడమే తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఉద్యోగ నియామపత్రాల పంపిణీ సందర్భంగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీ కూడా ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొని బోర్లు, పంటలు ఎండిపోతు రైతాంగం ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలలో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి మానవ బాంబులవుతాం..పేగులు తెంచి మెడలో వేసుకుంటామంటూ రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని, నిజానికి ఆయన ఇప్పటికే లక్షలాది రైతుల పేగులు మెడలు వేసుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మీదా నమ్మకంతో అత్యధికంగా రైతులు యాసంగి పంట వేశారన్నారు. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందీ కరువు వచ్చిందని ఆరోపించారు. ఒకవైపు రైతుబంధు వస్తదన్న ఆశతో అప్పులు చేసి వేసిన పంటలు ఎండిపోతుండగా, ఇటు రైతుబంధు కూడా రాక రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారన్నారు.

వ్యవసాయం, ఇరిగేషన్‌లపై సమీక్షలు ఎక్కడా

రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులపైన, ఎండుతున్న పంటలపైన, సాగుతాగునీటి ఎద్దడి పరిస్థితులపైన కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలపై సీఎం, మంత్రులు ఒక్క సమీక్ష చేయలేదని ఆరోపించారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం జనం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వంపై నిందలు మోపేందుకే ప్రభుత్వం సమీక్షలు చేయడం లేదన్నారు. కరవు సహాయక చర్యలు చేపట్టకపోగా, ప్రశ్నించిన బీఆరెస్ కేడర్‌పై కేసులు, దాడులతో అణిచివేత చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. వెంటనే వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు.

సాగర్‌లో నీళ్లున్నా ఇవ్వరు..కర్ణాటకను అడిగే సోయి లేదు

తాము నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజి 510 అడుగుల నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్ళు ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్‌లో నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయకట్టులో పంటలు ఎండుతున్నా రైతులకు నీరందించడం చేత కావడం లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళు ఉన్నాఅక్కడ వారి పార్టీ అధికారంలో ఉన్నప్పటికి నీటిని అడిగి తెచ్చుకునే సోయి కాంగ్రెస్ పాలకులకు లేదన్నారు. కర్ణాటక నుంచి నీళ్లు తీసుకొచ్చి సాగర్ ఎడమకాలువ రైతులకు నీరందించాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ కింద సూర్యాపేట, ఆలేరు ప్రాంతాలకు సాగునీరు ఇవ్వవచ్చని, గోదావరి నీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండిపోయేందుకు కాంగ్రెస్ కారణమవుతుందని విమర్శించారు.ఇవ్వాళ కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్ళు వృధాగా పోతున్నాయని చెప్పారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రాజకీయం విమర్శలు, కుట్రలు చేస్తున్నారని, సాధారణ రైతు కూడా చెరువుకు బుంగలు పడితే మరమ్మతులపై ఆలోచన చేస్తారని అలాంటిది మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా బీఆరెస్‌పై కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా మంచినీటి సమస్యలు మొదలయ్యాయని, సాగుతాగునీటి సమస్యలపై ప్రభుత్వానికి, మంత్రులకు ముందస్తు ప్రణాళికలు లేవని, వారి ముందస్తు ప్రణాళిక కేవలం ఢిల్లీకి ఎట్లా మూటలు పంపాలన్న ఆలోచనతోనే ఉందన్నారు. 8సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రోజైన ఎండిన పంట పొలాలను చూసేందుకు ఎందుకు వెళ్లలేదని విమర్శించారు. సీఎం రేవంత్ గతంలో తన బాస్‌ చంద్రబాబు చేసినట్లుగా మళ్లీ కరెంటు కోతలతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే చర్యలనే అనుసరిస్తున్నాడన్నారు.

గుత్తా అమిత్‌రెడ్డి టికెట్ ఎవరు అడ్డుకోలేదు

నల్లగొండ లోక్‌సభ నుంచి బీఆరెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న గుత్తా అమిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుండా తామే కాదు మరెవరు అడ్డుకోవడం లేదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అడ్డుకుంటున్నట్లుగా గుత్తానే ప్రకటన చేసుకున్నాడని, ఆయనే అడ్డుకుంటున్నారని చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి ఎంపీ స్థానాల బీఆరెస్‌ అభ్యర్ధుల ప్రకటన ఉంటుందన్నారు.