పొన్నం ఆవేశం స్టార్.. మంత్రి ఆఫీసు నుంచే లీకులు
పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే అవేశం స్టార్ అని పిలవాలని ఉందని బీఆరెస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

- కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తా
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
విధాత: పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే అవేశం స్టార్ అని పిలవాలని ఉందని బీఆరెస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశమని వ్యంగ్యాస్త్రాలు వేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడుతారని, మంత్రి మాటలు వింటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎలెక్షన్ కోడ్ వున్నప్పుడు నిన్న కమలపూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంచారని, వాటితో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఓట్లేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారని, అటువంటి మమ్మల్ని అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అధికారులను మంత్రి ఒత్తిడి చేస్తారని ప్రశ్నించారు. ఆర్డీవోకు ఫోన్ చేసి బెదిరిస్తున్నానని, సీఎస్‌కు కంప్లైంట్ చేశానని మంత్రి పొన్నం చెప్పారని, ప్రమాణానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయవద్దని ప్రశ్నించారు.
ఆర్డీఓకి నాకు మధ్య ఒక్క ఫోన్ కాల్ సంభాషణ ఉన్న దేనికైనా రెడీ అని, అసలు పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ అయ్యిందే ఆయన ఆఫీస్ నుంచని వెల్లడించారు. పొన్నం ఆఫీసు నుంచే లీకులు బైటికి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్టంలోనైనా కేసీఆర్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ పాలన పదేళ్లలో ఒక్క ఎకరం కూడా ఎండలేదన్నారు. కేసీఆర్ దిగిపోగానే కరెంటు బంద్ అవుతుందని, నీళ్లు బంద్, రైతుబంధు బంద్ అవుతుందని విమర్శించారు.
పొన్నం ప్రభాకన్ పనితీరు నచ్చకే కరీంనగర్ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓడించారని చెప్పుకొచ్చారు. పోలీసుల అలవెన్స్‌లు ములుగులో సీతక్క ఇచ్చారని, కరీంనగర్ లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తిం చేశారు. బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ని కోరుతున్నానని స్పష్టం చేశారు.