నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు.

  • By: Somu    latest    Mar 26, 2024 11:31 AM IST
నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మార‌డం లేద‌ని, ఆ వార్త‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని, త‌న గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తోనే ఉంటాన‌ని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఈ విషయం స్పష్టం చేస్తున్నానని తెలిపారు. పార్టీ మార్పు ప్రచారంపై కౌశిక్‌రెడ్డి ఓ వీడియో విడుద‌ల చేశారు.


పొద్దున్నే లేవ‌గానే.. సోష‌ల్ మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వచ్చిన వార్తలు చూడటం జరిగిందన్నారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తో, వారి కుటుంబంతో ఉంటానని, పార్టీ మారుతున్న‌ట్లు జర్నలిస్టులు ఇలాంటి చిల్ల‌ర వార్త‌లు ద‌య‌చేసి రాయొద్ద‌ని కోరుతున్నట్లుగా తెలిపారు. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రాసిన జ‌ర్న‌లిస్టులంద‌రిపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటానని, త్వ‌ర‌లోనే లీగ‌ల్ నోటీసులు పంపిస్తానని, ప‌రువు న‌ష్టం దావా కూడా వేస్తానని చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్త‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు నమ్మవద్దన్నారు.