84 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు

- తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో
- అత్యధిక శాతం మందిపై కేసులు
- అత్యధిక కేసులతో సీఎం రేవంత్ టాప్
- 89 కేసులతో రాజాసింగ్ రెండోస్థానం
విధాత: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. టీసీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు, గోషామహల్ నుంచి రెండోసారి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై 89 కేసులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై 52 కేసులు, మంచిర్యాలకు చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావుపై 32 కేసులు,కరీంనగర్ ఎమ్మెల్యే, గంగుల కమలాకర్‌పై 10 కేసులు, గజ్వేల్ నుంచి మళ్లీ ఎన్నికైన కేసీఆర్‌పై తొమ్మిది కేసులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఎనిమిది కేసులు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఆరు కేసులు ఉన్నాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఎన్జీవో సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ఆందోళన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, భూకబ్జా, మోసం, చెక్‌బౌన్స్‌లు, ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం, ప్రభుత్వోద్యోగిపై దాడి, నేరపూరిత కుట్ర వంటి కేసులు ఎమ్మెల్యేలపై నమోదైనట్టు ఫోరం వెల్లడించింది. కొత్త అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
రాష్ట్ర అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికార కాంగ్రెస్‌లో 52 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 39 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో 20 మందిపై క్రిమినల్ కేసులు, ఏడుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేల్లో నలుగురిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకే ఒక్క సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుపై కూడా పెండింగ్ కేసులు ఉన్నాయి.
15 మంది సభ్యులపై ఒక కేసు మాత్రమే ఉన్నది. మిగిలిన వారిపై 10 కంటే తక్కువ కేసులు ఉన్నాయి. క్రిమినల్ రికార్డులతో పాటు ఎమ్మెల్యేల ఆస్తులను కూడా ఫోరం విశ్లేషించింది. 119 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురికి రూ.100 కోట్లకుపైగా, 57 మందికి రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు, 55 మందికి రూ.10 కోట్ల లోపు ఆస్తులున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.461.05 కోట్లు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458.39 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
మరోవైపు దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్ నేనావత్ రూ.28 లక్షలతో అత్యల్ప ఆస్తులు ఉన్న సభ్యుడిగా, అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడు రూ.59 లక్షల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. విద్యా అర్హతల విషయంలో 119 మంది సభ్యుల్లో 46 మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 42 మంది గ్రాడ్యుయేట్లు, 27 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, నలుగురు పీహెచ్‌డీ హోల్డర్లు ఉన్నారు.