KomatiReddy | నిరుద్యోగ నిరసన ర్యాలీ: వారు వస్తే నేను రాను.. తర్వాతి పరిణామాలకు నా బాధ్యత కాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు
KomatiReddy విధాత: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నిరుద్యోగ నిరసన ర్యాలీ వ్యవహారం ఆ పార్టీ రాజకీయాల్లో అంతర్గత కల్లోలానికి కారణం అవుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు అయిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు నిరుద్యోగ నిరసన ర్యాలీ పట్ల అంటిముట్టనట్లుగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళపరుస్తుంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడి, రేపు నిర్వహించుకోబోతున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ రేవంత్ […]

KomatiReddy
విధాత: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నిరుద్యోగ నిరసన ర్యాలీ వ్యవహారం ఆ పార్టీ రాజకీయాల్లో అంతర్గత కల్లోలానికి కారణం అవుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు అయిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు నిరుద్యోగ నిరసన ర్యాలీ పట్ల అంటిముట్టనట్లుగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళపరుస్తుంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడి, రేపు నిర్వహించుకోబోతున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ రేవంత్ కు, సీనియర్లకు మధ్య వైరాన్ని మరింత రాజేస్తుంది.
మరీ ముఖ్యంగా తన నియోజకవర్గం పరిధిలో రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి తన వ్యతిరేకులైన పిసిసి నేతలు చెరుకు సుధాకర్ గౌడ్, పున్న కైలాష్ నేత, అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతుండటాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ గా తీసుకుంటున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వారంతా నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీకి వస్తే ఈ సందర్భంగా తలెత్తే పరిణామాలకు నాది బాధ్యత కాదంటూ వెంకటరెడ్డి హెచ్చరికలు జారీ చేశారన్న ప్రచారం గురువారం రోజంతా కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్న సదరు నేతలంతా నిరుద్యోగ నిరసన ర్యాలీకి విద్యార్థులను, యువతను తరలించే పనిలో ఉండగానే వెంకట్ రెడ్డి ఈ హెచ్చరికలు చేశారని, వెంకట్ రెడ్డి హెచ్చరికల పై వారంతా కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం.
దీంతో రేపు నల్లగొండలో జరగబోయే నిరుద్యోగ నిరసన ర్యాలీ కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి రచ్చకు దారి తీస్తుందోనన్న సందేహాలను ఆ పార్టీ కేడర్లో రేకెత్తిస్తున్నాయి. ఉత్తమ్, వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డిలు రేపు నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీలో యూనివర్సిటీ వరకే పరిమితమై అనంతరం గెస్ట్ హౌస్‌కు చేరుకోవాలని, పట్టణంలో రేవంత్ నిర్వహించే జరిగే ర్యాలీ, సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ సీనియర్ల నుండి నిరుద్యోగ నిరసన ర్యాలీకి సహకారం కొరవడిందని భావించిన రేవంత్ రెడ్డి ర్యాలీకి విద్యార్థి, నిరుద్యోగులను తరలించే బాధ్యతలను నియోజకవర్గాల్లోని తన వర్గీయులకు అప్పగించారు.
నల్గొండలో దుబ్బాక నరసింహారెడ్డికి, చెరుకు సుధాకర్ గౌడ్ కు, దేవరకొండ నుండి ఎన్. బాలునాయక్ కు, సాగర్ నుండి జానారెడ్డి తనయులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలకు, సూర్యాపేట నుండి పటేల్ రమేష్ రెడ్డికి, తుంగతుర్తి నుండి నాగరి గారి ప్రీతంకు, మిర్యాలగూడ నుండి శంకర్ నాయక్ కు, భువనగిరి, ఆలేరు నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య లకు, మునుగోడు నుండి పున్నా కైలాష్ కు విద్యార్థి, నిరుద్యోగుల సమీకరణ బాధ్యతలను అప్పగించారు.
ఈ వ్యవహారం కాస్త సీనియర్లలో రేవంత్ పై మరింత అగ్రహాన్ని రేకెత్తించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగే ర్యాలీకి తన వ్యతిరేకులు హాజరైతే జరగబోయే పరిణామాలకు తాను బాధ్యత కాదంటూ హెచ్చరించారంటూ ఆయన వ్యతిరేక వర్గీయుల్లో సాగిన ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సెగలు రేపుతుంది.
అటు రేవంత్ వర్గం, ఇటు సీనియర్లు ఇరువర్గాలు కూడా రేపటి నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహణపై పంతాలకు దిగడంతో ర్యాలీలో ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది.