Nalgonda | నిరుద్యోగ సభలో అవమానం.. అసహనంలో BC, SC నేతలు!
Nalgonda విధాత: నల్గొండలో కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో తమను వేదిక పైకి పిలవకపోగా కనీసం తమ పేర్లను ఉచ్చరించకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ లోని పలువురు బీసీ, ఎస్సీ నేతలు గుర్రుగా ఉన్నారు. నిరుద్యోగ నిరసన సభకు తమ వంతుగా విద్యార్థి, యువతను, ప్రజలను తరలించేందుకు కృషిచేసిన చెరుకు సుధాకర్ గౌడ్ ను, పున్నా కైలాష్ను, కొండేటి మల్లయ్యను, అలాగే అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను, తండు సైదులు గౌడ్ ను […]

Nalgonda
విధాత: నల్గొండలో కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో తమను వేదిక పైకి పిలవకపోగా కనీసం తమ పేర్లను ఉచ్చరించకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ లోని పలువురు బీసీ, ఎస్సీ నేతలు గుర్రుగా ఉన్నారు. నిరుద్యోగ నిరసన సభకు తమ వంతుగా విద్యార్థి, యువతను, ప్రజలను తరలించేందుకు కృషిచేసిన చెరుకు సుధాకర్ గౌడ్ ను, పున్నా కైలాష్ను, కొండేటి మల్లయ్యను, అలాగే అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను, తండు సైదులు గౌడ్ ను వేదిక పైకి పిలవలేదు.
కనీసం వారి పేరును కూడా రేవంత్ సహ ఇతర సీనియర్ నాయకులు ప్రస్తావించకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ సభ ప్రారంభానికి ముందు మల్లయ్య పేరు చెప్పిన మిగతా వారి పేర్లను చెప్పేందుకు ఆయనకు అవకాశం లేకుండా పోయింది.
నల్లగొండ సభలో పార్టీ సీనియర్ల మధ్య నెలకొన్న ఐక్యతను చూసిన సంతోషం కంటే వెంకటరెడ్డి మాట మేరకు తమను పక్కన పెట్టడంలో పెద్ద నాయకులంతా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరించడం తమను బాధించిందని వారు తమ అనుచరులతో వాపోతున్నారు.
వెంకట్‌రెడ్డి సూచనతోనే సభకు దూరంగా…
కాంగ్రెస్ పార్టీ కోసం తమ ప్రజలను, తమ సామాజిక వర్గాలను కదిలించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నప్పటికీ పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని వారు మధనపడుతున్నారు. ర్యాలీలో రేవంత్ వెంట కనిపించిన పున్నా కైలాష్, కొండేటి మల్లయ్యలు సభ వేదికపై మాత్రం కానరాలేదు. అంతకు ముందుగానే వెంకటరెడ్డి సూచన మేరకు వారందరినీ రేవంత్ ఈ నిరుద్యోగ సభకు దూరంగా ఉంచినట్లు భావిస్తున్నారు.
భవిష్యత్‌పై అంతర్మథనం..
దీంతో తాము పార్టీలో ఎంత పోరాడినా తమకు తమ సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసహనంతో పార్టీలో తమ భవిష్యత్తుపై వారు అంతర్మధనం చెందుతున్నారు. ఇదే నిరుద్యోగ సభా వేదిక నుండి మాట్లాడినవి. హనుమంతరావు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన ప్రకటన మేరకు, ఉదయ్ పూర్ డిక్లరేషన్ అనుసరించి జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ సీట్లు ఎస్సీ, ఎస్టీ స్థానాలు మూడు మినహాయిస్తే మిగిలిన వాటిలో మూడు సీట్లు బీసీలకు ఇవ్వాలని, మిగిలిన ఆరు సీట్లు మీరు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్లకు వేదిక పైనే సూచించడం కాంగ్రెస్ శ్రేణుల దృష్టిని ఆకర్షించింది.
పునరాలోచనలో నేతలు..
విహెచ్ వ్యాఖ్యలు అలా ఉండగానే మరోవైపు ఇదే సభ సందర్భంగా వెంకటరెడ్డి వ్యతిరేకించినందు వల్ల రేవంత్ సహా పార్టీ సీనియర్లు తమను నల్లగొండ నిరుద్యోగ సభా వేధికకు దూరం పెట్టారన్న బెంగ నిన్నటిదాకా రేవంత్ వెంట నడిచిన బీసీ, ఎస్సీ నేతలను బాధిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో తమ భవిష్యత్తు పట్ల చెరుకు సుధాకర్, పున్నా కైలాష్, దయాకర్, మల్లయ్య , తండు సైదులు పునారాలోచనలో పడినట్లు తెలుస్తుంది.
ఇతర పార్టీల వైపు చూపు..
పార్టీలో తమకు ఎదురవుతున్న చిన్నచూపు, లోపించిన సామాజిక న్యాయంతో అసహనానికి గురైన సదరు నేతలలో ఇద్దరు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా అనుచర వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ బీసీ, ఎస్సీ నేతల్లో నెలకొన్న అసహనాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు అధికార బిఆర్ఎస్ పార్టీ తెరవెనక పావులు కదుపుతు అసంతృప్త నేతలకు గాలం వేస్తుందన్న ప్రచారం వినిపిస్తోంది.
అయితే వెంకటరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో సాగుతున్న నిరుద్యోగ సభా ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ఆయన వ్యతిరేకించిన వారిని సభ వేదికపై పిలవడం గాని, వారి పేర్లను పలకడం గానీ చేయలేదని ఇందులో మరో దురుద్దేశం లేదని పార్టీలోని మరికొందరు చెబుతున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఊపు..
ఏది ఏమైనా నల్లగొండ నిరుద్యోగ సభ జిల్లా రాజకీయాల్లో అధికార బిఆర్ఎస్ ను ఢీకొట్టడంలో కాంగ్రెస్ కు కొత్త ఊపు తెచ్చిందన్న చర్చను బలోపేతం చేసినప్పటికీ, సభా నిర్వహణలో వెంకటరెడ్డి వ్యతిరేక వర్గీయులైన బీసీ, ఎస్సి నేతలకు జరిగిన అవమానం సైతం అంతే స్థాయిలో చర్చనీయాంశమవుతుండం గమనార్హం.