Bandi Sanjay: నయా రజాకార్ CM KCR.. నరహంతక పాలనకు చరమగీతం పాడుదాం: బండి సంజయ్
ప్రగతి భవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం తెలంగాణ గడ్డపై కాషాయ రాజ్యం లక్ష్యం TSPSC లీకేజీలో తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జి విచారణకు అభ్యంతరమేంటి KCR క్షమాపణ చెప్పాలి BJP స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నయా రజాకార్, నరహంతక పాలన సాగిస్తున్న కేసీఆర్ అధికారానికి చరమగీతం పాడి ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్, కరీంనగర్ ఎంపీ […]

- ప్రగతి భవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం
- తెలంగాణ గడ్డపై కాషాయ రాజ్యం లక్ష్యం
- TSPSC లీకేజీలో తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జి విచారణకు అభ్యంతరమేంటి
- KCR క్షమాపణ చెప్పాలి
- BJP స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నయా రజాకార్, నరహంతక పాలన సాగిస్తున్న కేసీఆర్ అధికారానికి చరమగీతం పాడి ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై కాషాయ రాజ్యాన్ని తీసుకు రావడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
రామరాజ్య స్థాపన కోసం చావడానికి కూడా తాను సిద్ధమంటూ సంజయ్ ఉద్రేకంగా ప్రకటించారు. హనుమ కొండలో శనివారం కేయూ క్రాస్ రోడ్స్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అనంతరం జరిగిన సభలో నిరుద్యోగులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
వచ్చేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే తొలిరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు.
30 లక్షల మంది భవిష్యత్తు అంధకారం
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని బండి సంజయ్ విమర్శించారు. ఇప్పటికే నిధులను మళ్ళించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే తప్పులకు బండి సంజయ్ బాధ్యుడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడాన్ని భరిద్దామా అంటూ ప్రశ్నించారు. మా అత్త దశదినకర్మకు పోకుండా నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని, అరెస్టులకు భయపడే పార్టీ బిజెపి కాదని స్పష్టం చేశారు.
బిడ్డ, కొడుకును కాపాడే ప్రయత్నం
ఢిల్లీ లిక్కర్ దందాలో బిడ్డను, కమీషన్ల నుంచి కొడుకును కాపాడేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నాడని బండి విమర్శించారు. దళితుడైన డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య, ఈటల రాజేందర్ లను ఏ తప్పు చేయకుండా మెడబట్టి కేబినెట్ నుంచి బయటికి పంపారని, మరి నీ బిడ్డ, కొడుకు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నావంటూ విమర్శించారు.
కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా? అంటూ నిలదీశారు. పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోతున్నా మిన్నకుంటున్నారని విమర్శించారు. వందల కోట్లు కొల్లగొట్టి కెసిఆర్ కుటుంబం ప్రజల రక్తం తాగుతుందని విమర్శించారు. ఈడి వస్తే కాలు విరిగిందని, దుబాయ్ పర్యటన ఉందంటూ సాకులు చెబుతున్నారని విమర్శించారు.
సిట్టింగ్ జడ్జి విచారణకు అభ్యంతరం ఎందుకు?
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, తప్పు జరగకపోతే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కెసిఆర్‌కు అభ్యంతరం ఏంటి అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బోర్డు సభ్యులను తొలగించేందుకు సమస్య ఏంటి అంటూ ప్రశ్నించారు. నీ బండారం బయట పడుతుందని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. 30లక్షల మంది ఇబ్బంది పడుతున్నా కేసిఆర్‌లో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్ళు, నిదులు, నియామకాలు కోసం తెలంగాణ సాధించామన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా, ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేసినా, రైతులు మృతి చెందినా, టీఎస్పీఎస్సీ లీకేజీ జరిగినా సీఎం స్పందించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని ప్రకటించారు.
CM KCR క్షమాపణ చెప్పాలి
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌కు అంబేద్కర్ ఇప్పుడు గుర్తొచ్చారని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానన్న హామీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
పది ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తామని, 21న పాలమూరులో నిరుద్యోగ మార్చి నిర్వహించి తర్వాత హైదరాబాదులో మిలియన్ మార్చ్ చేపపడతామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎంవీఎస్ ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.