NCP | 83 వచ్చినా చాలదా? ఇంకా మీకు రాజకీయాలు కావాలా?: అజిత్‌పవార్
NCP | పవార్ వల్లే ఎన్సీపీకి దక్కని సీఎం సీటు సీఎం అవుతానని చెప్పినా వినలేదు శరద్‌పవార్‌పై అజిత్‌పవార్ నిప్పులు ముంబైలో రెండు వర్గాల సమావేశాలు అజిత్ భేటీకి 40 మంది ఎమ్మెల్యేలు? నంబర్ గేమ్‌లో తిరుగుబాటు వర్గం పైచేయి పార్టీ గుర్తింపుపై ఈసీ వద్దకు పంచాయితీ ముంబై: పార్టీలో చీలిక తెచ్చి, ఏక్‌నాథ్‌శిండే ప్రభుత్వంలో చేరిన అజిత్‌పవార్.. తన రాజకీయ గురువు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీలో చీలిక అనంతరం తొలిసారి […]

NCP |
- పవార్ వల్లే ఎన్సీపీకి దక్కని సీఎం సీటు
- సీఎం అవుతానని చెప్పినా వినలేదు
- శరద్‌పవార్‌పై అజిత్‌పవార్ నిప్పులు
- ముంబైలో రెండు వర్గాల సమావేశాలు
- అజిత్ భేటీకి 40 మంది ఎమ్మెల్యేలు?
- నంబర్ గేమ్‌లో తిరుగుబాటు వర్గం పైచేయి
- పార్టీ గుర్తింపుపై ఈసీ వద్దకు పంచాయితీ
ముంబై: పార్టీలో చీలిక తెచ్చి, ఏక్‌నాథ్‌శిండే ప్రభుత్వంలో చేరిన అజిత్‌పవార్.. తన రాజకీయ గురువు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీలో చీలిక అనంతరం తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 83 ఏళ్లు వచ్చినా ఇంకా శరద్‌పవార్‌కు రాజకీయాలెందుకని ప్రశ్నించారు.
‘ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు రిటైర్ అవుతారు. రాజకీయాల్లో కూడా 75 ఏళ్లు దాటితే ఇక చాలనుకుంటారు. బీజేపీలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటివారిని చూశాం. ప్రతి ఒక్కరికీ తమ ఇన్నింగ్ అనేది ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకూ ఏమైనా చేయవచ్చు. మీకు 83 ఏళ్లు. ఇంకా చాలదా?’ అని శరద్‌పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కంటే ఎన్సీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్న అజిత్‌పవార్.. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌కు అప్పగించడాన్ని గుర్తు చేశారు. ‘ఆ రోజు కాంగ్రెస్‌కు సీఎం పదవి ఇవ్వకుండా ఉంటే.. ఈనాటికీ మహారాష్ట్రలో ఎన్సీపీ ముఖ్యమంత్రే ఉండేవాడు’ అని అన్నారు.
కాంగ్రెస్ కంటే రెండు సీట్లు అదనంగా ఎన్సీపీ గెలిచినా ఆ పార్టీకి మన సీనియర్ నేత సీఎం పోస్టు అప్పగించారని విమర్శించారు. శరద్‌పవార్ వల్లే అనేక సంవత్సరాలుగా ఎన్సీపీకి సీఎం పదవి దక్కలేదని ఆరోపించారు. గతంలో ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా.. పార్టీ మాట వినకుండా భిన్నమైన వైఖరి తీసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి సందర్భంలో తనను విలన్ చేశారని అజిత్ మండిపడ్డారు. ‘2014తో పోల్చితే 2019లో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఎన్సీపీకి ఉన్నది. నేను ఐదు సార్లు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాను. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని అనేక సందర్భాల్లో ఆయనకు చెప్పాను. అయినా ప్రతిసారీ నన్ను ఎందుకు విలన్‌ను చేశారు?’ అని ఆయన ప్రశ్నించారు.
అజిత్ భేటీకి 35 మంది ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలుస్తున్నది. శరద్‌పవార్ సమావేశానికి 14 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు సమాచారం. దీంతో నెంబర్‌గేమ్‌లో అజిత్ వర్గందే పై చేయిగా కనిపిస్తున్నది.
ఎన్సీపీకి అసెంబ్లీలో మొత్తం 53 మంది సభ్యులు ఉన్నారు. సమావేశానికి వచ్చిన 35 మందే కాకుండా మరో ఐదుగురు కూడా తమ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ పాటిల్ మీడియాకు చెప్పారు. ఎన్సీపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్సీల్లో ఐదుగురు దక్షిణ బాంద్రాలో జరుగుతున్న సమావేశానికి హాజరైనట్టు ఎన్సీపీ చీలికవర్గం చెబుతున్నది.
అనర్హత వేటు తప్పించుకోవడానికి అజిత్‌పవార్ వర్గానికి కనీసం 36 మంది ఎమ్మెల్యల మద్దతు అవసరం. బుధవారం రెండు వర్గాల బల ప్రదర్శన సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శరద్‌పవార్ మద్దతుదారులు దక్షిణ ముంబైలోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఒక అభిమాని ’83 ఏండ్ల కురువృద్ధ యోధుడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు’ అని ప్లకార్డును ప్రదర్శించాడు.
అజిత్ వర్గం సమావేశం దక్షిణ ముంబైలోని భుజ్‌బల్ నాలెడ్జ్ సెంటర్‌లో నిర్వహిస్తుండగా.. శరద్‌పవార్ వర్గం యశ్వంత్‌రావు చవాన్ సెంటర్‌లో సమావేశమైంది. ఇదిలా ఉంటే.. మొత్తం 53 మంది సభ్యులకుగాను 40 మంది తమతోనే ఉన్నారని ఎన్సీపీ చీలిక వర్గం ఎమ్మెల్యే అనిల్‌పాటిల్ చెప్పారు.
తాము ఆషామాషీగా ప్రభుత్వంలో చేరలేదని, తమ వెనుక 40 మంది ఎమ్మెల్యలు ఉన్నందునే చేరామని అజిత్ వర్గంలో కీలక నేత ఛగన్ భుజ్‌బల్ చెప్పారు. తమదే అసలైన ఎన్సీపీ అని మొన్నటి వరకూ శరద్‌పవార్‌కు విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న ప్రఫుల్ పటేల్ అన్నారు.
ఎన్నికల కమిషన్ వద్దకు పంచాయితీ
ఎన్సీపీ చీలిక వ్యవహారం ఎన్నికల కమిషన్ వద్దకు చేరింది. 40 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లతో అజిత్‌పవార్ వర్గం కమిషన్‌ను కలిసింది. మరోవైపు పార్టీ చీలిక అంశంలో ముందు తమ వాదన విన్నాకే ఎటువంటి ఉత్తర్వులనైనా జారీ చేయాలని కోరుతూ సీఈసీకి కేవియట్ పిటిషన్ సమర్పించింది. తనకు అందించిన ఇరు పక్షాల డాక్యుమెంట్లను పరిశీలించి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.