BJP State President: తెలుగు రాష్ట్రాల బీజేపీ సారధుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

విధాత : ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, , రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా కరంద్లాజే నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు స్క్రూటినీ, సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రక్రియ కొనసాగనుంది. జూలై 1న ఏపీ, తెలంగాణల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక నిర్వాహణ, అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఏపీలో ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త అధ్యుక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి, పార్టీ కీలక నేతలు నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఏపీ బీజేపీ నుంచి రాయలసీమకు చెందిన బీసీ నేత సత్య కుమార్ ను మంత్రిగా చేయగా…రెండు రాజ్యసభకు సీట్లు కూడా బీసీ(ఆర్. కృష్ణయ్య, పాకా సత్యనారాయణ)లకే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ దఫా అధ్యక్ష పదవి రాయలసీమ రెడ్డికి ఇవ్వవచ్చన్న చర్చ సాగుతోంది.
ఇక తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
అధ్యక్ష ఎన్నిక రేసులో రాజ్యసభ సభ్యుడే కె. లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మహిళల కోటాలో డీకే అరుణ..సీనియర్ నేత రామచంద్రరావు, ఆచారిలు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈ దఫా బీసీకే ఇవ్వబోతుండటం విశేషం.