మంత్రి మ‌ల్లారెడ్డి ఇళ్లలో రెండో రోజు ఐటీ త‌నిఖీలు.. కుమారుడికి ఛాతి నొప్పి.. ఆస్పత్రికి తరలింపు

కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్ల‌లోనూ… విధాత‌: మంత్రి మల్లారెడ్డి అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజూ కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాడుల్లో 65 బృందాలు పాల్గొనగా అందులో కర్ణాటక, ఒడిస్సాలకు చెందిన సుమారు 400 మందికి పైగా అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు నడుమ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇండ్లలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు […]

  • By: krs    latest    Nov 22, 2022 4:07 PM IST
మంత్రి మ‌ల్లారెడ్డి ఇళ్లలో రెండో రోజు ఐటీ త‌నిఖీలు.. కుమారుడికి ఛాతి నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
  • కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్ల‌లోనూ…

విధాత‌: మంత్రి మల్లారెడ్డి అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజూ కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాడుల్లో 65 బృందాలు పాల్గొనగా అందులో కర్ణాటక, ఒడిస్సాలకు చెందిన సుమారు 400 మందికి పైగా అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు నడుమ తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇండ్లలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు ఉదయం మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి స్వల్ప అస్వస్దతకు లోనయ్యారు. చాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయనను సూరారంలోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్‌కు తరలించారు.

కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు మంత్రి మల్లారెడ్డి సూరారంలోని ఆస్పత్రికి వెళ్లగా ఆయనతో పాటు ఐటీ అధికారులు కూడా దవాఖానకు వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రి దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు నిర్వహించగా ఐటీ దాడులు ఈ రోజు, రేపు కొనసాగనున్నాయి.

ఈ దాడుల్లో భాగంగా గత పదేళ్లుగా మల్లారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌, వైద్య, డెంటల్‌, ఇతర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 65 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఇవాళ పొద్దుగాల నుంచే ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

మంత్రితో పాటు ఇద్దరు కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి , సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆయన వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, స్నేహితులు, మల్లారెడ్డితో పాటు కలిసి వ్యాపారం చేస్తున్న వాళ్లందరి ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో ఈ సోదాలు చేపట్టారు. కండ్లకోయలోని సీఎంఆర్‌ కళాశాలలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య కళాశాల, మల్లారెడ్డి డెంటల్‌ కాలేజీలో రికార్డులు పరిశీలించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి పెద్ద కొడుకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి దంత, వైద్య కళాశాలతో పాటు, ఆస్పత్రులకు మల్లారెడ్డి చిన్నకుమారుడు భద్రారెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు జరుగుతు న్నాయి. ఐటీ తనిఖీల్లో దొరికిన కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషిస్తున్నారు. సుమారు 50 చోట్ల సాగుతున్న ఈ తనిఖీల్లో రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు.

మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ మార్గాలను, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలతో పాటు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సోదాలు చేపట్టినట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పది సంవత్సరాల ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. సోదాల నేపథ్యంలో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇళ్లు, కార్యాలయాల వద్ద సీఆర్‌పీఎఫ్‌ పటిష్ట బలగాలను ఏర్పాటు చేసింది. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతిం చడం లేదు. మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరిగేవని, వాటి వివరాలను రాబట్టాలని సంస్థల ఛైర్మన్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

నిన్న సుచిత్రాలోని బీమా పైడ్‌ అపార్ట్‌మెంట్‌లో మంత్రి సమీప బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కొంపల్లిలోని అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న మంత్రికి అత్యంత సన్నిహితుడు సంతోష్‌ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మధ్యాహ్నం తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేయడంతో సంతోష్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తెరిచారు. తర్వాత అధికారులు సోదాలు ప్రారంభించారు.

ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ బంధువుల గ్రానైట్‌ కంపెనీల్లో, తాజాగా మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులు జరుగుతుండటం, మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ నేతల పాత్రపై సిట్‌ దర్యాప్తు చేస్తుండటం రాజకీయ కలకలం రేపుతున్నది.