BJP | అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకం! ఆవి పార్టీ నినాదాలే.. విధానాలు కావు!

BJP| KARNATAKA విధాత‌: దేశంలో పేరుకే కొన్నిపార్టీలు జాతీయ పార్టీలు. కానీ అధికారం కోసం అవి అప్పుడప్పుడు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మారిపోతుంటాయి. ప్రధాని నిత్యం కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ యేతర రాష్ట్రాలకు వెళ్లి వారసత్వ రాజకీయాల గురించి ప్రసంగాలు దంచుకుంటారు. నిజంగానే వారు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం లేదా? ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పార్టీలుగా పేరు పడిన పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటే ఆ పార్టీ నేతల నుంచి మౌనమే సమాధానం వస్తుంది. ఎందుకంటే […]

  • By: Somu    latest    Apr 13, 2023 10:21 AM IST
BJP | అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకం! ఆవి పార్టీ నినాదాలే.. విధానాలు కావు!

BJP| KARNATAKA

విధాత‌: దేశంలో పేరుకే కొన్నిపార్టీలు జాతీయ పార్టీలు. కానీ అధికారం కోసం అవి అప్పుడప్పుడు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మారిపోతుంటాయి. ప్రధాని నిత్యం కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ యేతర రాష్ట్రాలకు వెళ్లి వారసత్వ రాజకీయాల గురించి ప్రసంగాలు దంచుకుంటారు.

నిజంగానే వారు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం లేదా? ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పార్టీలుగా పేరు పడిన పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటే ఆ పార్టీ నేతల నుంచి మౌనమే సమాధానం వస్తుంది.

ఎందుకంటే తనకు మెజారిటీ రాకున్నాఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం, అక్కడ వారసత్వ రాజకీయాలను, అవినీతి ఆరోపణలు ఉన్నా చూసిచూడనట్టు వ్యవవహరించడం గత తొమ్మిదేళ్లుగా కాషాయపార్టీ అగ్రనేతలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులతో పాటు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మరోసారి ప్రధాని కుటుంబపాలన, అవినీతి గురించి ప్రస్తావించారు.

కుటుంబపాలన, అవినీతి వేర్వేరు కాదన్నారు. కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. నిజంగా మోడీ దేశాభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారు అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు.

కానీ ఆయన అవినీతి, కుటుంబపాలన గురించి ధ్వజమెత్తిన తర్వాతనే బీజేపీ నేతలు కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీని, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సీఆర్‌ కేశవన్‌కు కాషాయ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.

ఇవి వారసత్వ రాజకీయాలు కావా? అని ఎవరైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహులో, ప్రగతి నిరోధకులో, బీజేపీ ఎదుగుదలను ఓర్వలేని వారు అని ఏదో ఒక ముద్ర వేసి ఎదురుదాడి చేస్తుంటారు. అంటే బీజేపీ మినహా ఏ పార్టీ వారసులకు టికెట్లు ఇచ్చినా అది పెద్ద నేరంగా చిత్రీకరిస్తారు.

ఇక ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో ఎలాగైనా గెలవడానికి ఆ పార్టీలో 75 ఏళ్లు పైబడిన వారికి నో పదవులు అన్న నిబంధనలు పక్కనపెట్టారు. దేశమంతా మోడీ మోడల్‌ అంటున్న నేతలకు అక్కడ యడ్యూరప్ప మినహా మరో నేత కనిపించడం లేదు.

అక్కడ ప్రభుత్వం కమీషన్ల బాగోతాన్ని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు బహిరంగంగానే బైట పెట్టిన తర్వాత అక్కడ కనిపించని నాలుగో సింహాం మోడీ మాత్రం అక్కడ అవినీతిని అరికట్టడానికి పూనుకోరు. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటివి అక్కడ పనిచేయవు.

ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రామరాజ్యం నడుస్తున్నదని మనం అనుకోవాలి. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని మీ పార్టీలో ఎలా చేర్చుకున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే… అమిత్‌ షా మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడవద్దు అని అంటారు.

అందుకే యడ్యూరప్ప హయాంలో జరిగిన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా బీజేపీ పెద్దలు మౌనంగానే ఉంటారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో యడ్యూరప్ప మాట్లాడిన ఆడియో రికార్డులు బైటికి వచ్చినప్పటికీ వాటిని విస్మరించారు.

అంతేకాదు యడ్యూరప్పను సీఎం సీటును దించేస్తే ఆయన అసంతృప్తిని చల్లార్చడానికి ఎన్నికల తర్వాత ఆయన తనయుడు విజయేంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌ చేశారు అంటే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం, విలువ అంటూ ఏమీ లేదని స్పష్టమౌతుంది.

పాపం మోడీ, షాలు ఏం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం కష్ట పడుతున్నారని కొందరు ఆ పార్టీ భక్తులు ఆ వాట్సప్‌లో వచ్చేవే నిజమని భ్రమ పడుతారు. అయితే వారి బీజేపీ సిద్ధాంతం, భావజాలాన్ని అభిమానిస్తున్న వారి ఆలోచన వేరే విధంగా ఉంటుంది.

కానీ రాజకీయాల్లో మోడీ-షాలు ఆ సైద్ధాంతిక దృక్పథానికి తిలోదకాలు ఇచ్చి అధికారం కోసం అవకాశ వాదం, స్వప్రయోజనాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారని గత తొమ్మిదేళ్ల కాలంగా చూస్తున్నదే. అలాగే కర్ణాటకలో ఫలితాలు తమకు ప్రతికూలంగా ఉంటాయని సర్వేలు ఇప్పటికే స్పష్టం చేయడంతో.. ప్రత్యామ్నాయ ప్రయత్నాలను కాషాయ పార్టీ మొదలుపెట్టినట్టు సమాచారం.

అవసరమైతే ఎన్నికల అనంతరం జేడీఎస్‌తో జట్టు కట్టి అయినా కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మా పార్టీ గెలుస్తుందని చెప్పలేం. కానీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇప్పుడు కాకపోయినా లోక్‌సభ ఎన్నికల తర్వాత అయినా మేమే అధికారంలోకి వస్తామని ఒక బీజేపీ నేత వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

దీన్నిబట్టి బీజేపీ ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోదని మరోసారి స్పష్టమౌతున్నది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను మార్చిన వాళ్లు తొమ్మిదోసారి ఆ పనిచేయడానికి ఎందుకు సిగ్గు పడుతారు? ఎందుకు సంకోచిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.