MLC KAVITHA | మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు?: MLC కవిత
MLC KAVITHA | కాంగ్రెస్, బీజేపీలకు సూటిప్రశ్న రైతు రుణమాఫీకి ఒక్క రూపాయీ ఇవ్వని కేంద్రం ఆర్మూర్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన కవిత, పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. వ్యవసాయానికి […]

MLC KAVITHA |
- కాంగ్రెస్, బీజేపీలకు సూటిప్రశ్న
- రైతు రుణమాఫీకి ఒక్క రూపాయీ ఇవ్వని కేంద్రం
- ఆర్మూర్ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన కవిత, పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు.
వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా? లేదా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా అన్నది రైతులు ఆలోచించుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టమంటున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.15 లక్షల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం.. రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
మూడో సారీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ పొందిన తర్వాత మొదటి సారి జీవన్ రెడ్డి ఆర్మూర్ కు వచ్చారని, ఆయనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 2014లో మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలపొంది జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని, రెండో సారి 30 వేల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు.
ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ఈ సారి కచ్చితంగా 60 వేల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే వాటిపై జరిగిన పోరాటంలో 850 మంది రైతులు మరణిస్తే వాటిని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు దోస్తు కాదని, ప్రజలతో కొనసాగే ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు.
2014లో ప్రజలు తమ పార్టీకి 63 సీట్లు ఇచ్చారని, 2019లో 88 సీట్లు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా 100కుపైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ను, జీవన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆర్మూర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు.