హైదరాబాద్‌లో మంచి ఆతిథ్యమే లభించింది.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ దిద్దుబాటు వ్యాఖ్యలు

విధాత: క్రీడా స్ఫూర్తిని అనుసరించి తమ క్రికెటర్లు శత్రు దేశాలకు కూడా వెళ్లి ఆడతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ ) ఛైర్మన్ జకా అష్రాఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టిన మరుక్షణం అతడు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన భారత్‌ను ఉద్దేశించే అన్నాడని అందరికీ అర్థమయింది.
దీంతో ఇరు దేశాల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇటు భారత్‌తో పాటు అటు పాక్‌లోని క్రీడాభిమానులు కూడా అష్రాఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో పాక్ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించిందని.. ఆతిథ్యంలో పిసరంత కూడా తగ్గలేదని సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తిపోయాయి. దీంతో పీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

హైదరాబాద్‌లో తమ క్రికెటర్లకు, సిబ్బందికి లభించిన ఆతిథ్యం, స్వాగతం అమోఘమని అష్రాఫ్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఆతిథ్యం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు అద్దం పడుతోంది. భారత్ – పాక్ జట్లు చిరకాల ప్రత్యర్థులు మాత్రమే కానీ శత్రువులు కాదు అని అందులో పేర్కొంది.
టోర్నీ ఆసాంతం తమ క్రికెటర్లకు ఇదే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని.. పాక్ క్రికెటర్లు తమ ఆటతో భారతీయులను తప్పకుండా అలరిస్తారని అష్రాఫ్ పేర్కొన్నారు. చివరిసారి టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు 2016లో వచ్చిన పాక్.. మళ్లీ ఇప్పడే 2023 వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత్‌లో పర్యటిస్తోంది.