కాంగ్రెస్ ఏం చేసిందో తేల్చుకుందామా? మంత్రి KTRకు PCC చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్

హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద చర్చకు సిద్ధం తప్పయితే ముక్కు నేలకు రాస్తా కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజం నుంచి మీ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నాం ధర్మారెడ్డి కాదు దందాల రెడ్డి తిని ఏ గాడిద కొడుకు పరామర్శించడూ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ మంత్రి కేటీఆర్ పదేపదే ప్రశ్నిస్తున్న సవాల్‌ను స్వీకరించి హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద చర్చకు నేను సిద్ధం… మీరు సిద్ధమా? అంటూ పిసిసి చీఫ్ […]

కాంగ్రెస్ ఏం చేసిందో తేల్చుకుందామా? మంత్రి KTRకు PCC చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్
  • హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద చర్చకు సిద్ధం
  • తప్పయితే ముక్కు నేలకు రాస్తా
  • కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
  • తెలంగాణ సమాజం నుంచి మీ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నాం
  • ధర్మారెడ్డి కాదు దందాల రెడ్డి
  • తిని ఏ గాడిద కొడుకు పరామర్శించడూ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ మంత్రి కేటీఆర్ పదేపదే ప్రశ్నిస్తున్న సవాల్‌ను స్వీకరించి హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద చర్చకు నేను సిద్ధం… మీరు సిద్ధమా? అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎదురు సవాల్ విసిరారు. మాది తప్పైతే ముక్కు నేలకు రాస్తానని… మీది తప్పని తేలితే మీ అయ్య, నువ్వు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సోమవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పరకాల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పరకాల సెంటర్లో సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం, హంద్రీనీవా, శ్రీరాంసాగర్, ప్రాణహిత – చేవెళ్ల, దేవాదుల, పాలమూరు – రంగారెడ్డి, రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని వివరించారు. కరెంటు, నీళ్లు, ఊరికొక బడి, ఆసుపత్రులు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయని చెప్పారు.

సిద్దిపేట నియోజకవర్గం మీ అయ్య సొంతూరు చింతమడకలో బడి, గుడి కూడా కాంగ్రెస్ నిర్మించిందేనని అన్నారు. హైదరాబాదులో అభివృద్ధి, హైటెక్ సిటీ, ఇన్ఫోసిస్, పరిశ్రమలు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, ఊరూరికి బస్సు, రోడ్లు, ప్రాథమిక వసతులన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగినయనని గుర్తు చేశారు.

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్ మిల్లు, షుగర్ మిల్లు మూత పెట్టేశారని విమర్శించారు. లక్షలాది మంది పేదలకు మేము ఇల్లు ఇస్తే మీరు మొండి చేయి చూపెట్టారని, ఉచిత కరెంటు మేమిస్తే మీరు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ కుటుంబం అభివృద్ధి చెందింది

ప్రజల సంక్షేమం అభివృద్ధికి మేము పాటుపడితే మీరు మాత్రం టీవీ, పేపర్ పెట్టుకొని, ఫామ్ హౌజ్‌లు కట్టుకొని, వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము మీ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నాం

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ కుటుంబం అయితే, ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లోకి ఈ కుటుంబ సభ్యులు ఎవరిని ఎందుకు అనుమతించడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరవీరులు, పేదల బిడ్డలను ప్రగతి భవన్ ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వన్నా పెట్టారా? అంటూ నిలదీశారు.

గిరిజన విద్యార్థి డాక్టర్ ప్రీతి చనిపోతే ఏ దొంగ నా కొడుకు ఆ కుటుంబాన్ని పరామర్శించారా? అని తీవ్రంగా విమర్శించారు. అలాంటి మీరు మా కుటుంబం ఎలా అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబాన్ని పరకాల అమరవీరుల గడ్డ సాక్షిగా బహిష్కరిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఓట్ల కోసం కేటీఆర్ నాటకాలు

మన ఓట్ల కోసం తెలంగాణ ప్రజలంతా మా కుటుంబమేనంటూ నాటకాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. చిన్నారి బాబును కుక్కలు పీక్కతింటే పలకరించాలనే జ్ఞానం లేని వాళ్ళు, ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఆలోచన లేని వాళ్ళు మా కుటుంబం ఎలా అవుతారని ప్రశ్నించారు.

డాక్టర్ ప్రీతి సంఘటనలో ఏ గాడిద కొడుకు పోయి పరామర్శించిండని అన్నారు. ప్రిన్సిపాల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోలేదని, పోలీస్ దర్యాప్తు సక్రమంగా సాగలేదని అలాంట‌ప్పుడు మీరు మా కుటుంబం ఎలా అవుతారని విమర్శించారు.

ఓట్లతో బుద్ధి చెప్పాలి

కెసిఆర్ కుటుంబానికి అధికారం మన ఓట్లతో వచ్చిందని, ఆ ఓట్లతోనే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ రాక్షసుల ప్రాణం ఈ చిలుకల్లో ఉన్నాయని ఆ మెడ విరి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ తెచ్చిండని చెబుతున్న టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, మరి ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి అధికారం ఇవ్వరా? అంటూ ప్రజలను కోరారు. సామాజిక తెలంగాణ కలలుగని ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని, ఆ కలలు నిజం కావాలన్నా, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మీ కష్టాలు తీరుతాయని భరోసా కల్పించారు.

ధర్మారెడ్డి కాదు దందాల రెడ్డి

పేరులోనే ధర్మం ఉంది కానీ, చేసేవన్నీ దందాలేనని, అందుకే ధర్మారెడ్డి కాదు దందాల రెడ్డి అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో అన్నింటి పైన చల్లా ధర్మారెడ్డి ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు. ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, రాజయ్య ఇలాంటి దండుపాళ్యం ముఠాకు ఎర్రబెల్లి దయాకర్ రావు లీడరుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా.. టెండర్ వేయాలన్నా ధర్మారెడ్డి కంపెనీ లేదా ఆరూరి రమేష్ కంపెనీ పోటీపడుతూ ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టులు, కాంక్రీటు, క్రషర్, సిమెంట్, భూములు అన్ని చల్లా ధర్మారెడ్డివే అంటూ విమర్శించారు. ఇలాంటి దండుపాళ్యం ముఠాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

రానున్నది కాంగ్రెస్‌ అధికారం

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సభకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జి యాదవ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క‌, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్నర్ మీటింగ్ కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.