బీఆరెస్.. కాంగ్రెస్ ఒక్కటే: ప్రధాని మోడీ
తెలంగాణలో బీఆరెస్-కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. సోమవారం అదిలాబాద్ జిల్లా బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కుటుంబ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని, దోచుకోవడం అబద్ధాలు చెప్పి మనుగడ సాగించడమే వాటి పని అని విమర్శించారు

- దోచుకోవడం..అబద్దాలు చెప్పడమే కుటుంబ పార్టీల పని
- కాళేశ్వరం అవినీతిపై బీఆరెస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయ్యింది
- దేశ ప్రజలే నా కుటుంబం
- తెలంగాణకు టెక్స్‌టైల్ పార్క్
- దేశమంతా మోడీ గ్యారంటీలపై చర్చ
- మళ్లీ మోడీ సర్కార్ రావాలంటే బీజేపీకి ఓటు వేయాలి
- వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ముందడుగు
- దేశ ప్రజలే మోడీ కుటుంబం
- వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే నాపై ప్రతిపక్షాల విమర్శలు
- ఆదిలాబాద్ బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
విధాత : తెలంగాణలో బీఆరెస్-కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. సోమవారం అదిలాబాద్ జిల్లా బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కుటుంబ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని, దోచుకోవడం అబద్ధాలు చెప్పి మనుగడ సాగించడమే వాటి పని అని విమర్శించారు. కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని మోడీ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తుందని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆరెస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుందని, గతంలో మీరు తిన్నారుని, ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బీఆరెస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. దేశ అభివృద్ధి కోసం వేలకోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, ఇది ఎన్నికల సభ కాదని, ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
దేశమంతా మోడీ గ్యారంటీలపై చర్చ జరుగుతుందని, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పని పూర్తయ్యే గ్యారంటీ అని ప్రధాని తెలుగు భాషలోనే చెప్పడం విశేషం. ఫిర్ ఏకాబార్ మోడీ సర్కార్ కావాలంటే 400సీట్లు సాధించాలని, అందుకు బీజేపీకి ఓటు వేయాలని తెలుగులోనే మోడీ చెప్పారు. మేరా భారత్ మేరా పరివార్ నే భావనతో అంతా కలలు కనాలని, మీ కలలను నేను సాకారం చేస్తానన్నారు. ఎందుకంటే నాకు 140కోట్ల దేశ ప్రజలే నా కుటుంబమని మోడీ స్పష్టం చేశారు. నా జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు.
నేను ఒక కల కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్లానని, దేశం కోసం బతుకుతానని బయటకు వచ్చానని, కేవలం మీ కోసమేనని అన్నారు. మీ కలలు నిజం చేయడమే నా సంకల్పమని, ఎన్నికలు వస్తే రానివ్వండని, అప్పుడు చూసుకుందామని, అంతకంటే నాకు దేశాభివృద్ధి ముఖ్యమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మోడీ కుటుంబమని చెప్పుకోవాలన్నారు.
వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే తనను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. నేను మోడీ కుటుంబమని మీరంతా చెప్పుకోవాలని కోరారు. అయోధ్య రామ మందిరం తలుపుల ఏర్పాటు, ఆలయ నిర్మాణంలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నాకు తెలంగాణ ప్రజల ప్రేమ, అప్యాయత కావాలని మోడీ కోరారు. మీకు సేవ చేసేందుకు పరితపిస్తున్నానని చెప్పారు.
బీజేపీ రాకముందు అదివాసీ మహిళ భారత రాష్ట్రపతి అవుతోందని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. అదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందున్నారు. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందన్నారు. కొత్తగా పీఎం జన్‌మన్ పథకంతో 16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలో ఈ రోజు వికాస ఉత్సహాం జరుగుతోందని, 15 రోజుల్లోనే రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎస్, పలు రైల్వే, రోడ్డు పనులు ప్రారంభించానని తెలిపారు. 15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశామన్నారు.
మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణాలో పెడతాం” అని మోదీ ప్రకటించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్మమని మోడీ స్పష్టం చేశారు. ఆదివారం కేంద్రమంత్రులు, అధికారులతో కేబినెట్ భేటీ నిర్వహించానని, ఈ భేటీలో ఎన్నికల గురించి కాకుండా వికసిత్ భారత్ పైనే చర్చించామన్నారు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కోసం మళ్లీ బీజేపీకి ఓటేయాలని ఈ సందర్భంగా మోడీ విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 7 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని, రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిటును జాతికి అంకితం చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్‌రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.