తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు

- ప్రధాని మోడీ స్పష్టీకరణ
- పెద్దన్నలా సహకరించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రధానికి ఘన స్వాగతం పలికిన సీఎం
విధాత : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ 6వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ రెండో థర్మల్ పవర్ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ.56 వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించామని చెప్పారు. ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు అయ్యిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
ఎన్టీపీసీ రెండో యూనిట్ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుందని, ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందని, దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.
పెద్దన్నలా సహకరించాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ మాకు పెద్దన్నలా సహకరించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని, రెండు ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములను కేంద్రం తెలంగాణకు అప్పగించడం పట్ల తాము ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇవ్వడం ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడిందని చెప్పారు హైదరాబాద్ మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్ధించారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ కూడా డెవలప్ కావాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వం కారణంగా పదేళ్లలో 4వేల మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీలో ఇప్పటిదాకా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే సాధించగలిగామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణకు టెక్స్‌టైల్ పార్క్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నామని, ఎన్‌టీపీసీకీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.
ప్రధానికి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
అదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ తమిళి సైత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ, రేవంత్‌రెడ్డిలు పలుమార్లు ముచ్చటించుకోవడం సభికులను ఆకట్టుకుంది. గత బీఆరెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని రాష్ట్ర అభివృద్ధి సాధనకు, ప్రోటోకాల్ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకడాన్ని అభినందించారు. దేశ ప్రధాని 41ఏళ్ల తర్వాతా అదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినట్లుగా జిల్లా నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.