Vande Bharat Express | నేడు ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందే భారత్ రైళ్లు.. ఏయే మార్గాల్లో నడవనున్నాయంటే..?

Vande Bharat Express | భారతీయ రైల్వే మరిన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలు నగరాలను కలుపుతూ తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగానే ఆదివారం ఒకే రోజు కొత్తగా తొమ్మిది మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రైళ్లను ప్రారంభించనున్నారు. కొత్తగా నడువనున్న రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభంకానున్నాయి. తొలిసారిగా ఆరెంజ్ రంగులో నడువనున్నట్లు రైళ్లు సైతం పట్టాలెక్కనున్నాయి.
కొత్త మార్గాల్లో పూరీ- రూర్కెలా, కాసర్‌గోడ్- త్రివేండ్రం, ఉదయపూర్- జైపూర్, రాంచీ-హౌరా, తిరునెల్వేలి- చెన్నై, పాట్నా-హౌరా, హైదరాబాద్- బెంగళూరు, జామ్‌నగర్-అహ్మదాబాద్, విజయవాడ- చెన్నై కొత్త మార్గాల్లో రైళ్లు నడువనున్నాయి. తొమ్మిది రూట్లలో ప్రస్తుతం 8 ఎనిమిది కోచ్‌లతో వందే భారత్ రైళ్లను నడుపనున్నది. ప్రస్తుతం దేశంలో 25 మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. వీటి సంఖ్య 34కు పెరుగనున్నది.
నాలుగు నార్తర్న్ జోన్‌లో, 3 సదరన్, మరో 3 సెంట్రల్ జోన్‌లలో పరుగులు తీస్తున్నాయి. వెస్ట్రన్, వెస్ట్ సెంట్రల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో రెండు రైళ్లు చొప్పున వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సేవలు అందిస్తున్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్ట్రన్, ఈశాన్య ఫ్రాంటియర్, ఈస్ట్ సెంట్రల్, నైరుతి, ఈశాన్య రైల్వే జోన్లలో ఒక్కో సెమీ హైస్పీడ్ రైలు నడుస్తున్నది.