‘లోక్‌సభ’కు ముందే రాజకీయ రణం!. కత్తులు దూస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేసవికి ముందే వేడి పుట్టిస్తున్నాయి.

కత్తులు దూస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
నాటి బీఆరెస్ సర్కార్ అక్రమాలపై విచారణలు,
ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి నేతల వలసలు
డబుల్ స్ట్రాటజీతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు
అధికార కాంగ్రెస్‌పై మాజీ సీఎం కేసీఆర్ కృష్ణాస్త్రం
ప్రాజెక్టుల అప్పగింతపై రాజకీయ సెగలు
విధాత: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేసవికి ముందే వేడి పుట్టిస్తున్నాయి. ప్రాజెక్టులు, భూ దందాలు, ప్రభుత్వ పథకాల ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, ఆనాటి బీఆరెస్ మంత్రులు భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ.. వారి చర్యలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆరెస్.. మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోకుండా పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరోవైపు పెద్దపల్లి బీఆరెస్ ఎంపీ వెంకటేశ్ నేత వంటి వారిని చేర్చుకోవడంతోపాటు పలువురు బీఆరెస్ ఎమ్మెల్యేలను టచ్‌లో పెట్టుకున్న కాంగ్రెస్.. తమ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీఆరెస్ నేతలకు బహుముఖ వ్యూహాలతో గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నది. లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభతో ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ తమపై సంధించిన కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వివాదాన్ని రేవంత్ ప్రభుత్వం ఘాటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నించింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం కేసీఆర్ నిర్వాకమేనంటూ బీఆరెస్ ప్రభుత్వ హయాం నాటి ఒప్పందాలను బయటపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేసి సేఫ్‌సైడ్‌లో నిలిచారు. అటు సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ప్రాజెక్టులపై అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఘాటైన సెటైర్లు సంధించారు. తమకు ప్రాజెక్టులపై అవగాహన ఉంది కాబట్టే శ్రీశైలం, సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని, కేసీఆర్‌కు అవగాహన లేకనే కాళేశ్వరం కుంగిపోయిందని ఎద్దేవా చేశారు. అంతేగాక కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ పోరాటం పేరుతో నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు అనుమతిని ఇవ్వరాదని కూడా రేవంత్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తున్నది. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అణిచివేతకు పాల్పడ్డాడని, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాజకీయ ప్రయోజనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం కోసం ఆయన నిర్వహించే సభలకు ఎందుకు అనుమతినివ్వాలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో నెల రోజులపాటు సభలు, ర్యాలీలకు అనుమతులను నిషేధిస్తూ పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తున్నది. అనుమతుల నిరాకరణ నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది.
అసెంబ్లీలో చర్చకు రమ్మంటే నల్లగొండలో సభ ఎందుకో!
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎన్నిగంటల చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నెల 8నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుండగా ప్రాజెక్టుల వివాదంపై చర్చకు సిద్ధమవ్వాల్సిన బీఆరెస్ నేతలు అనూహ్యంగా పక్కా రాజకీయ వ్యూహంతో ఈ నెల 13న నల్లగొండ సభను ప్రకటించారని అంటునారు. ప్రజాక్షేత్రంలో పోరాటంతోపాటు అసెంబ్లీ వేదికగా చర్చలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలన్న బీఆరెస్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైన బీఆరెస్ సభను భగ్నం చేయడంతో పాటు అసెంబ్లీ వేదికగా బీఆరెస్ దాడిని తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తున్నదని సమాచారం. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను పదేళ్లపాటు పడకేయించిన కేసీఆర్ నల్లగొండకు వస్తే తరిమికొడుతామంటూ ఇప్పటికే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదని హెచ్చరించారు. దీంతో శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో పోలీస్ ఆంక్షలు అమలులోకి తెచ్చి, కేసీఆర్ నల్లగొండ సభకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ దిక్కయిన ఉద్యమ ట్యాగ్‌లైన్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పిదప తన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు తొలిసారిగా వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడికి తనకు గతంలో అచ్చొచ్చిన తెలంగాణ హక్కుల రాగాన్నే అందుకున్నారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వివాదమే అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం, దానితో లోక్‌సభ ఎన్నికల గండాన్ని దాటడం అనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లోని నీళ్ల అంశాన్ని తీసుకుంటూ.. ‘మా నీళ్లు మాకే.. మా ప్రాజెక్టులు మాకే..’ అంటూ మరో ఉద్యమానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందంటూ కృష్ణాస్త్రాన్ని రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ సంధించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని ప్రకటించారు. ఎన్ని అడ్డంకులెదురైనా ఈ నెల 13న నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతూ రేవంత్ ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. చిత్రంగా అసెంబ్లీ ఎన్నికల వేళ దేశానికే తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శమన్న ప్రచారం కాస్తా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి వెనుకబడిపోగా, తెలంగాణ ఉద్యమ నినాదమైన ‘మా నీళ్లు మాకే..’, ‘తెలంగాణ హక్కుల సాధన’ అన్న సెంటిమెంట్ నినాదాలే మళ్లీ కేసీఆర్‌కు దిక్కవ్వడం చర్చనీయాంశంగా మారింది.