పాలమూరుపై నేతల ఫోకస్.. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ పర్యటనలు

- బీఆర్ఎస్‌లో శంఖస్థాపనలు, ప్రారంభోత్సవాల హడావుడి
- మోడీ సభతో బీజేపీ ఎన్నికల శంఖారావానికి సన్నద్ధం
- కొల్లాపూర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- ఎన్నికల షెడ్యూల్‌కు ముందే రాజకీయ వేడి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పాలమూరుపై ఫోకస్ పెట్టారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గా లు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల అధిష్టానం ఇక్కడ పాగా వేసేందుకు ఇప్పటినుంచే ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదైన శైలిలో ప్రచారం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
పెండింగ్ పనులన్నీ తెర పైకి తెస్తున్నారు. అధినాయకులతో శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాలు చేపట్టి ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో మంత్రులను రంగంలోకి దింపి, ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పాలమూరు నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలను ఆకట్టుకునే రీతిలో పనులు చేపడుతున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గం లో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన ఖరారైంది. బీజేపీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాలమూరుకు రప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోకొల్లాపూర్ లో భారీ బహిరంగ సభకు అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు షెడ్యూల్ కు ముందే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.
ఎవరి పర్యటన ఎక్కడ!
పాలమూరు నియోజకవర్గంలో అక్టోబర్ ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దాదాపు ఖరారైంది. మోడీ పాల్గొనే బహిరంగ సభ ప్రాంతాన్ని పట్టణ సమీపంలోని భూత్పూర్ వెళ్లే రహదారి పక్కన ఏర్పాటు చేసేందుకు బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖరావం ఇక్కడి నుంచే మోడీ మోగిస్తారని ఈ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. మోడీ పర్యటన ఖరారైనా, ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు.
అభ్యర్థుల ప్రకటన చేయకపోవడంతో జనసమీకరణ కు ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టికెట్ ఆశించే అభ్యర్థులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తే జనసమీకరణకు ఇబ్బందులు ఉండవని ఆలోచిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా కమిటీ ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
పట్టు కోసం మంత్రి ఆరాటం
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు ప్రజాకర్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రధాన కూడళ్ళ వద్ద ప్రజలను ఆకట్టుకునేలా కళాకృతులను ఏర్పాటు చేశారు. పెద్ద చెరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కేబుల్ బ్రిడ్జి, శిల్పారామం పనులు చేసి ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇదివరకే చెరువు వద్ద డ్రోన్ కెమెరాలతో ప్రదర్శన నిర్వహించారు. మళ్ళీ ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను ఆకట్టుకునే పనిలో మంత్రి బిజి అయ్యారు.
కేటీఆర్, హరీశ్ లకు ఆహ్వానం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఈ నెల 29న ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం వనపర్తి లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ రాకతో నియోజకవర్గంలో మరింత పట్టు సాధించేందుకు నిరంజన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకద్ర నియోజకవర్గంలో వచ్చే నెల 4న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కొత్తకోట మండలంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం పుంజుకుని మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆల వెంకటేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ సభ
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించకలేదు. దీంతో ఆ పార్టీ టికెట్ ఆశించే నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల జాబితా వెలువడక ముందే కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో సభ నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి నెల రోజులవుతున్నా కాంగ్రెస్ లో మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితా కొలిక్కి రాలేదు.