వీసీల నియామకాలకు పైరవీలు!

వీసీల నియామకం విషయంలో గత తప్పిదాలు పునరావృతమవుతాయా? లేక చెప్పినట్టుగానే వాస్తవ దృష్టితో అకడమిక్‌ అర్హతలు, పాలనా దక్షత కొలబద్దలుగా నియామకాలు ఉంటాయా? అన్న విషయంలో యూనివర్సిటీల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి

  • By: Somu    latest    Feb 19, 2024 12:11 PM IST
వీసీల నియామకాలకు పైరవీలు!
  • వర్సిటీల ప్రక్షాళనకు సిద్ధమైన సర్కార్‌
  • ఇందుకు వీసీల ఎంపికే అత్యంత కీలకం
  • సెర్చ్‌ కమిటీల్లో రాజకీయ లింకులు!
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం?
  • గత తప్పిదాలు పునరావృతమయితే
  • విద్యాలయాలు భ్రష్టుపట్టడం ఖాయం
  • సర్కారుకు విద్యావేత్తల హెచ్చరికలు



(విధాత ప్రత్యేకం)



వీసీల నియామకం విషయంలో గత తప్పిదాలు పునరావృతమవుతాయా? లేక చెప్పినట్టుగానే వాస్తవ దృష్టితో అకడమిక్‌ అర్హతలు, పాలనా దక్షత కొలబద్దలుగా నియామకాలు ఉంటాయా? అన్న విషయంలో యూనివర్సిటీల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం నియమించిన వీసీ నియామకాలు వివాదాస్పదమయ్యాయి. కొందరి నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లను, అర్హత లేని వాళ్లను నియమించారని ఆరోపిస్తూ కోర్టులకు వెళ్లారు. అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


రాజకీయ ప్రోద్బలంతో నియామకాలు చేపట్టడం వల్ల విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధ్యాపకుల నియామకాలు జరగడం లేదు. దీంతో పాలనా వ్యవస్థ కుంటుపడుతున్నది. గత ప్రభుత్వం మూడేళ్ల కిందట నియమించిన వీసీల్లో 70 ఏళ్లు దాటిన వారిని, ప్రొఫెసర్‌గా పది సంవత్సరాలు అనుభవం లేని వారిని నియమించారని ఆరోపిస్తూ కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన కొంతమంది వీసీలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేసే విద్యార్థులపై కేసులు పెట్టడంతోపాటు, వారిపై నిర్బంధకాండను ప్రయోగించారనే విమర్శలున్నాయి.


విజ్ఞాన కేంద్రాలుగా, వికాస కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు దీనివల్ల అశాంతి కేంద్రాలుగా మారిపోయాయని అంటున్నారు. ఈసారి కూడా వీసీల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీసీలు విద్యార్థుల పట్ల మానవీయంగా ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి వారధిగా ఉండాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. కానీ.. గత ప్రభుత్వ హయాలో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పాకులాడుతూ, విద్యార్థుల సమస్యలను పక్కనపెట్టి, విద్యా వ్యవస్థ కునారిల్లేలా చేశారనే విమర్శలున్నాయి.


ఆరోపణలుంటే తొలి దశలోనే తొలగించాలి


గత ప్రభుత్వ హయాంలో వీసీల పదవీకాలం పూర్తయిన వెంటనే నియామకాలు చేపట్టకపోవడంతో ఇన్‌చార్జ్‌ల పాలన సాగింది. ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయరాదని విద్యావేత్తలు సలహా ఇస్తున్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల ప్రక్షాళనపై దృష్టి సారించింది. దానికి అనుగుణంగా ఇన్‌చార్జ్‌ వీసీల పాలన అక్కరలేకుండా కొత్త వీసీలను త్వరగా నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. సెర్చ్‌ కమిటీల కోసం ఆయా యూనివర్సిటీల పాలక మండలి సమావేశాలూ పూర్తయ్యాయి.


అయితే గత తప్పులు ఈసారి పునరావృతం కాకూడదని విద్యార్థులు కోరుకుంటున్నారు. యూజీసీ నిబంధనలను అనుసరించి అకడమిక్‌ మెరిట్‌ ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. యూనివర్సిటీల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకున్నారని, అలాంటి వారి పనితీరు, పాలనా దక్షత గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, రిసెర్చ్‌ స్కాలర్స్‌, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరిపైనా అవినీతి ఆరోపణలు ఉంటే వారిని మొదటి దశలోనే తొలిగించాలంటున్నారు.


వీసీల ఎంపికే కీలకం


ప్రస్తుత ప్రభుత్వం యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ఈ సమయంలో వీసీల ఎంపిక కీలకం. అయితే వీసీల ఎంపికకు నియమించే సెర్చ్‌ కమిటీలో పార్టీలతో సంబంధాలున్న అధ్యాపకులను సిఫార్సు చేశారని సమాచారం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎందుకంటే పాలకమండలి సభ్యుల సిఫార్సులతో ప్రస్తుత వీసీలలో కొందరుపావులు కదుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


వీటిపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. లేకపోతే విశ్వవిద్యాలయాలు భ్రష్టు పుడతాయని, విద్యార్థుల్లో అశాంతి మరింత పెరుగుతుందని ఆ తర్వాత ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదంటున్నారు. ఎందుకంటే ఒకరిద్దరు వీసీలు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను పరిష్కరించడం, వారికి నచ్చజెప్పడం చేయాల్సిన వీసీలు.. వారితో నిత్యం ఘర్షణ పడుతున్నానే విమర్శలున్నాయి.


గత సెర్చ్‌ కమిటీలోనివారే మళ్లీ!


గతంలో సెర్చ్‌ కమిటీలో ఉన్న వాళ్లు ప్రస్తుతం ఉన్నారు. అయితే సెర్చ్‌ కమిటీకి దరఖాస్తు చేసుకున్నవారి దక్షత, వారి వైఖరి, వారి అకడమిక్‌ క్రెడిట్స్‌, వారిపై ఎవైనా అవినీతి ఆరోపణలున్నాయా అన్నది ఆడిట్‌ చేయించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. అప్లై చేసుకున్న సమయంలోనే వారి ఆస్తులు బహిర్గతం చేయాలనే నిబంధన పెట్టాలని చెబుతున్నారు. గతంలో సెర్చ్‌ కమిటీలో ఉన్నవాళ్లు సంతకాల కోసం ఐఏఎస్‌ల ముందు పడిగాపులు కాశారని సమాచారం. వీళ్లనే ముందుపెట్టి వీసీ పదవులు దక్కించుకోవడానికి పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


అందుకే ‘సెర్చ్‌ కమిటీలో స్థానికులు ఉండకూడకుండా చూడాలి. రాజకీయ నేపథ్యంలోని భావజాలాల కతీతంగా, తటస్థమైన వ్యక్తులు సెర్చ్ర్చ్ కమిటీలో ఉండాలి. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన వ్యక్తులపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సంబంధించిన సాక్షాలని సేకరించి వాటి తీవ్రతను బేరీజు వేయాలి. ఇలా చేసేటప్పుడు మంచి వారి వ్యక్తిత్వాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత కూడా సెర్చ్‌ కమిటీ పైన ఉంటుంది.


వీసీలుగా నియమితులయ్యేవారికి కుల మతాలతో సంబంధం ఉండకూడదు. వారి సమర్థతతే ప్రామాణికం కావాలి. సెర్చ్‌ కమిటీలోనూ, వీసీ నియామకాల్లోనూ మహిళా ప్రొఫెసర్లను పరిగనణలోకి తీసుకోవాలి. వీసీలు అంకితభావంతో పనిచేయాలి. విద్యార్థులకు ఒక భరోసా కల్పించాలి. అప్పుడే విశ్వవిద్యాలయాలు బాగుపడుతాయి. పూర్వవైభవం వస్తుంది’ అని మాజీ వీసీ ఒకరు వ్యాఖ్యానించారు.