Ponguleti | కేసీఆర్‌ను గద్దె దించేందుకు నాలుగు మెట్లైనా దిగుతా: పొంగులేటి
సీఎల్పీ నేత భట్టిని పరామర్శించిన పొంగులేటి విధాత : మాయమాటలతో మోసపూరిత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిగించేందుకు తాను నాలుగమెట్లయినా దిగి పని చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti) రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో అస్వస్థతో చికిత్స పొందుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన పరామర్శించారు. ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు కావడంతో పార్టీలో ఖమ్మం జిల్లా వారి చేరికలు, […]

- సీఎల్పీ నేత భట్టిని పరామర్శించిన పొంగులేటి
విధాత : మాయమాటలతో మోసపూరిత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిగించేందుకు తాను నాలుగమెట్లయినా దిగి పని చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti) రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో అస్వస్థతో చికిత్స పొందుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన పరామర్శించారు.
ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు కావడంతో పార్టీలో ఖమ్మం జిల్లా వారి చేరికలు, ఖమ్మంలో రాహుల్ గాంధీతో నిర్వహించబోయే బహిరంగ సభ వంటి అంశాలపై కూడా చర్చించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, భట్టి లు మీడియా సమావేశంలో మాట్లాడారు.
పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా దగా చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి, వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకో లేదన్నారు. రెండు ఎన్నికల ప్రణాళికల్లోనూ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించడం దురదృష్టకరమన్నారు.
ఏదో సీట్ల కోసమో, అధికారం కోసమో తన రాజకీయ ఆలోచన ఉండదని, మోసపూరిత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యం అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ప్రమేయం ఏమిటంటు జిల్లా సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రశ్నకు పొంగులేటి స్పందిస్తూ నాకు అటువంటి ఆలోచన లేదని నేను ఈ వేదిక ద్వారానే జిల్లా కాంగ్రెస్ సీనియర్లకు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. మోసపూరిత కేసిఆర్ పాలన అంతానికి మండుటెండల్లో భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి రానుండడం, భట్టినీ పరామర్శించడం శుభప్రదం అన్నారు. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అంతా ఐక్యంగా ఒకటే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయి అన్నారు. భట్టి పాదయాత్ర సూర్యాపేట నియోజకవర్గంలో రేపటినుండి కొనసాగుతుందన్నారు.
భట్టి మాట్లాడుతూ నన్ను పరామర్శించేందుకు వచ్చిన, కాంగ్రెస్ లో చేరేందుకు ముందుకొచ్చిన పొంగులేటికీ ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఉద్యమ లక్ష్యాలు విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఉద్యమ లక్ష్యాలను సాధించాలన్న పార్టీ ఆలోచనతో కలిసి పని చేసేందుకు వచ్చిన పొంగులేటికి అభినందనలు అన్నారు.
తెలంగాణ సమాజంలో ప్రజల జీవితాల్లో మార్పు తేవడం కోసం పొంగులేటి కలిసి రావడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. సంపూర్ణంగా నిండు మనసుతో వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామని, సోనియాగాంధీ ఆశయాలను సాధించడంలో పొంగులేటి కూడా కీలక భూమిక పోషించాలన్నారు. పాదయాత్ర కారణంగా తాను నిన్న రేవంత్, వెంకట్ రెడ్డిలతో పాటు పొంగులేటి, జూపల్లిల ఇంటికి వెళ్లలేకపోయాను అన్నారు.
రాహుల్ గాంధీ సూచన మేరకు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా పొంగులేటి పార్టిలో చేరనున్నారన్నారు. భారీ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ రాబోతుందన్న సంకేతాన్ని ఖమ్మం నుండి తెలంగాణ సమాజానికి అందిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజ ప్రగతికి అడ్డంగా మారిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన దిశగా ఖమ్మం సభ మార్గదర్శకంగా నిలబడుతుందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ భావజాలం, ప్రజల అభిమానం ఉన్న వారిని సర్వేల ద్వారా గుర్తించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేతల ప్రధాన లక్ష్యం టికెట్లు, సీట్లు కాదని తెలంగాణ సమాజాన్ని కెసిఆర్ కబంధహస్తాల నుండి విముక్తి చేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య బెల్లయ్య నాయక్, పిడమర్తి రవి, తుళ్లూరు బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.