Ponguleti | పొంగులేటి దారెటు? కాంగ్రెస్‌లో చేరేందుకే 90% క్యాడర్ మొగ్గు
ఖమ్మం అంతటా ఆత్మీయ సమావేశాల నిర్వహణ అంతర్గత సర్వేచేయించుకున్న మాజీ ఎంపీ సన్నిహితులు కూడా కాంగ్రెస్ వైపే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న సన్నిహిత సీఎం అక్కడ దొరికే రిలీఫ్ ఏమి ఉండదని ఉద్బోధ! రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించిన పొంగులేటి విధాత: ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలు, పార్టీలు ఇప్పటి నుంచే తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఒక వైపు, వ్యక్తిగతంగా పలువురు […]

- ఖమ్మం అంతటా ఆత్మీయ సమావేశాల నిర్వహణ
- అంతర్గత సర్వేచేయించుకున్న మాజీ ఎంపీ
- సన్నిహితులు కూడా కాంగ్రెస్ వైపే
- బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న సన్నిహిత సీఎం
- అక్కడ దొరికే రిలీఫ్ ఏమి ఉండదని ఉద్బోధ!
- రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించిన పొంగులేటి
విధాత: ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలు, పార్టీలు ఇప్పటి నుంచే తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఒక వైపు, వ్యక్తిగతంగా పలువురు నాయకులు మరో వైపు రహస్య సర్వేలు చేయించుకుంటున్నారు. అయితే గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటున్న ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) పయనం ఎటువైపు ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాలలో బాగా చర్చ జరుగుతున్నది.
బీఆర్‌ఎస్ (BRS) పార్టీలోనే ఉంటూ పార్టీకి దూరం పాటిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొంత కాలంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తాను ఎటు ఉంటానో అని చెపుతున్నారు. తాను ఏ రాజకీయ పార్టీ అని కాకుండా క్యాడర్‌తోనే ఉంటానని, క్యాడర్ మనోభిప్రాయం ప్రకారమే నడుచుకుంటానని అంటున్నారు. ఇలా జిల్లాల్లో ప్రజలకు, క్యాడర్‌కు బాగా దగ్గరయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పొంగులేటి ప్రభావం ఖమ్మం ఉమ్మడి జిల్లాపై స్పష్టంగా ఉంటుందని జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న పలువురు పరిశీలకులు చెబుతున్నారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. పార్లమెంటు స్థానం గెలుపు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయగల శక్తి ఆయనకు ఉన్నదని అంటున్నారు. తన అనుకున్న వాళ్లకు మొత్తం తానై ఖర్చు పెడతాడన్న చర్చ కూడా జిల్లా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది.
సమ్మేళనాలు.. రహస్య సర్వేలు!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే… మరో వైపు రహస్యంగా సర్వే చేయించుకున్నట్లు సమాచారం. ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంది? స్వంత పార్టీ పెడితే ఎలా ఉంటుంది? లేక ఏ పార్టీతో ఉంటే ప్రజల మద్దతు వస్తుంది? క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఏం చేయాలి? అనే అంశాలపై ఒక ఏజెన్సీతో రహస్యంగా జిల్లా అంతటా సర్వే చేయించుకున్నట్లు సమాచారం.
బీజేపీ వైపు వెళ్లినా ప్రయోజనం ఉండదని ఈ సర్వేలో తేలినట్టు తెలిసింది. ముఖ్యంగా కమ్యూనిస్టుల మట్టి వాసనతో పెరిగిన ఈ జిల్లాలో మత పునాదులపై పెరిగిన పార్టీని ప్రజలు ఆదరించరన్న అభిప్రాయం మెజార్టీగా వచ్చినట్లు తెలిసింది. మరో వైపు అధికార బీఆర్‌ఎస్‌లో ఉంటే ప్రాధాన్యం ఉండదని కూడా సర్వేలో అభిప్రాయం వ్యక్తమైనట్టు చెబుతున్నారు.
సొంతగా పార్టీ పెడితే?
ఏ పార్టీలోకీ వెళ్లకుండా సొంతంగా తానే ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుందనే అంశంలోనూ పొంగులేటి అభిప్రాయాలు సేకరించారని సమాచారం. అయితే సొంత పార్టీ పెడితే దాని మనుగడ కష్టమని, క్యాడర్‌ను నిలుపుకోవడం ఇబ్బంది అవుతుందని ఎక్కువమంది చెప్పినట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్‌తో ఉంటేనే ఉత్తమం!
ఖమ్మం జిల్లాకు ఉండే రాజకీయ వారసత్వ పరిస్థితి రీత్యా ఈ జిల్లాలో కాంగ్రెస్‌తో ఉంటేనే మనుగడ అని 90శాతం మంది అభిప్రాయ పడినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న వారికే పదవులు వస్తాయని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అనేక విషయాలు చర్చించడానికి కూడా వీలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలిసింది.
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని, ఇది నియోజకవర్గానికి 15 నుంచి 20 వేల మధ్య ఉంటుందని ఈ సర్వేలో వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్‌కు సొంత బలం తోడైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీని సులువుగా నిలువరించ వచ్చన్న అభిప్రాయం సర్వే రిపోర్ట్‌లలో వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.
సన్నిహితులతో చర్చోపచర్చలు
సర్వేలో మెజార్టీ అభిప్రాయం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని రావడంతో ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు తెలిసింది. సన్నిహితులు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా మెరుగైందని, గట్టిగా కష్టపడితే బీఆర్‌ఎస్‌ను నిలువరించినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే రాజకీయాలకు సొంత పార్టీ పెట్టడం కన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అన్న అభిప్రాయాన్ని పొంగులేటికి తెలియజేసినట్టు చెబుతున్నారు.
ఆ.. సీఎందీ అదే మాట!
దక్షిణ భారత దేశంలో పొంగులేటికి సన్నిహితుడిగా పేరున్న ఒక ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సదరు ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్, బీజేపీకి తేడా ఏమీలేదని, రాజకీయ అవసరాల రీత్యా బీజేపీతో బీఆర్‌ఎస్ అవగాహనకు వచ్చే అవకాశం లేకపోలేదని అన్నారని సమాచారం.
బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడవద్దని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ భవిష్యత్‌పై, ఏపార్టీలో ఉండాలనే అంశంపై ఆలోచించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోమని సదురు ముఖ్యమంత్రి ఉచిత సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.
రాహుల్‌కు మద్దతు వెనుక?
అయితే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై ఎందుకు విచారణ చేయరని కూడా ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించడం చూస్తే పొంగులేటి కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.