Ponguleti | పొంగులేటి ప్రభావం అంతంతే.. కానీ కాంగ్రెస్‌తో కలిస్తే!
Ponguleti Srinivas Reddy విధాత: రాష్ట్రంలో ఎండాకాలంతో పాటు ఎన్నికల హీట్ కూడా మొదలైంది. బీజేపీలోకి చేరికలు ఆగిపోగా.. ఉన్న నేతల్లోనే విభేదాలతో చీలికల సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు, బీజేపీలో వర్గ విభేదాలతో సతమతమవుతుండగా.. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ జోష్‌లో ఉన్నది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధిష్ఠానం గతంలోనే ప్రకటించడంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. సర్వేల సందడి కూడా షురూ అయ్యింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి […]

Ponguleti Srinivas Reddy
విధాత: రాష్ట్రంలో ఎండాకాలంతో పాటు ఎన్నికల హీట్ కూడా మొదలైంది. బీజేపీలోకి చేరికలు ఆగిపోగా.. ఉన్న నేతల్లోనే విభేదాలతో చీలికల సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు, బీజేపీలో వర్గ విభేదాలతో సతమతమవుతుండగా.. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ జోష్‌లో ఉన్నది.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధిష్ఠానం గతంలోనే ప్రకటించడంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. సర్వేల సందడి కూడా షురూ అయ్యింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఇంకా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వాళ్లు ఈ పార్టీలో చేరుతారు? ఆ పార్టీలో చేరుతారనే ఊహాగానాలే ఇంకా నడుస్తున్నాయి. అయితే ‘వోటా’ అనే సర్వే సంస్థ ఖమ్మం రాజకీయాలపై ఒక సర్వే నిర్వహించింది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన ఆ జిల్లాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అసలు ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనే అనేక విషయాలపై ఆసక్తికరంగా వెల్లడయ్యాయి.
అయితే ప్రచారం జరుగుతున్నట్టు ఆయన ప్రభావం ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో లేదని, ఆయనే పోటీ చేస్తే కొత్తగూడెంలో కచ్చితంగా గెలువవచ్చని, ఇల్లందు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని సర్వే సారాంశం.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఆయన కాంగ్రెస్‌తో జతకడితే ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, మధిర, వైరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు కచ్చితంగా గెలుస్తాయని, ఖమ్మం, భద్రాచలం, అశ్వారావుపేటలో పోటాపోటీ ఉంటుందని అక్కడి ప్రజల అభిప్రాయంగా తేలింది.
ఒకవేళ పొంగులేటి బీజేపీలో చేరితే ఆయన, ఆపార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని కాషాయ నేతలు ఖంగుతినే ఫలితాలు వస్తాయని తేలింది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాలని సుమారు 90 శాతం ప్రజలు ఓటు వేశారు. అంతేకాదు ఆయన ఆపార్టీ చేరితేనే అక్కడ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని పైన పేర్కొన్న నియోజకవర్గాల ప్రజల మనోగతం తెలియజేస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీలతో కాకుండా స్వతంత్రంగా తాను పది నియోజకవర్గాల్లో పోటీకి దిగితే ఆయన గెలువకపోగా అంతిమంగా అది అధికారపార్టీకి అనుకూలంగా మారుతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ సర్వే ద్వారా తేలింది ఏమిటి అంటే వ్యక్తుల కంటే పార్టీ ప్రభావమే ఎక్కువ అని స్పష్టమైంది.
గతంలో ఈటల రాజేందర్ అధికారపార్టీకి రాజీనామా చేసి ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పుడు ఆయన గ్రాఫ్ 75 శాతానికి పైగా ఉన్నది. తీరా ఆయన బీజేపీలోకి వెళ్లాక ఆయన గట్టి పోటీని ఎదుర్కొని గతంలో కంటే తక్కువ మెజారిటీతో గట్టెక్కారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సర్వే ద్వారా ప్రధానంగా తెలిసింది ఏమిటి అంటే రాష్ట్రంలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని, బీజేపీ చేస్తున్న ప్రచారమంతా ఉత్తదే అని తేటతెల్లమైంది.