Nalgonda: కమలదళంలో అసమ్మతి సెగలు! జిల్లా సారథ్యానికి పోటా పోటీ..!
విధాత: బిజెపి నల్గొండ జిల్లా పార్టీ కమిటీకి రేపో మాపో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకులలో అంతర్గతంగా దాగిన అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికలో బిజెపి నుండి టిడిపిలోకి వెళ్లి తిరిగి కొన్నాళ్ల క్రితం బిజెపిలో చేరి రాష్ట్ర కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న మాదగోని శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే నాగం వర్షిత్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోరిడార్ బండారు ప్రసాద్ […]

విధాత: బిజెపి నల్గొండ జిల్లా పార్టీ కమిటీకి రేపో మాపో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకులలో అంతర్గతంగా దాగిన అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికలో బిజెపి నుండి టిడిపిలోకి వెళ్లి తిరిగి కొన్నాళ్ల క్రితం బిజెపిలో చేరి రాష్ట్ర కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న మాదగోని శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే నాగం వర్షిత్ రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోరిడార్ బండారు ప్రసాద్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇన్నాళ్లుగా జిల్లా పార్టీ సారధిగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదని ఈ దఫా తనకు అవకాశం కల్పించాలని ఎస్సీ మోర్చా నేత పోతేపాక సాంబయ్య పార్టీ అధిష్టానాన్ని గట్టిగానే కోరుతున్నారు. జిల్లాలో తమ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉన్నా పార్టీలో ఎస్సీ, ఎస్టీలకు తగిన పదవులు దక్కడం లేదని ఆ వర్గం నాయకులు మధన పడుతున్నారు.
వీరికి తోడు బిజెపి సీనియర్ నాయకులు బొజ్జ శేఖర్ కూడా పార్టీ అధ్యక్ష పదవి రేసులోకి వచ్చారు. నల్గొండ పట్టణంలో తమ సామాజిక వర్గం ఓటర్లు మొదటి నుండి బిజెపికి ఓటు బ్యాంకుగా ఉన్నారని, 30 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి వ్యయ ప్రయాసలతో పని చేస్తున్న తమకు పార్టీలో తగిన పదవులు దక్కడం లేదంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా తన ఆవేదనతో కూడిన లేఖను ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించారు.
విద్యార్థి సంఘం ఏబీవీపీ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జిగా 1989 నుండి పనిచేస్తూ 1995లో జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా, బిజెపి నుండి నీలగిరి సూపర్ బజార్ డైరెక్టర్‌గా ఎన్నికయి, బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా, 2009లో నల్లు ఇంద్రసేనారెడ్డి సస్యశ్యామల యాత్ర సహా ప్రముఖ్ గా, సుష్మా స్వరాజ్ నల్గొండ సభ ఇన్‌చార్జిగా తాను బాధ్యతలు నిర్వర్తించిన వైనాన్ని బొజ్జ శేఖర్ లేఖలో ఏకరువు పెట్టారు. పార్టీ జిల్లా శిక్షణ శిబిరం కన్వీనర్ గా జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపానని, ఆ జీవన సహయోగి నిధికి ఐదు లక్షలు విరాళం ఇచ్చానని, పార్టీ కోశాధికారిగా పని చేశానని, జిల్లా పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించి నూతన కార్యాలయాన్ని పార్టీకి అందుబాటులోకి తెచ్చానన్నారు.
2017 నుండి 2020 వరకు రాష్ట్ర పార్టీ బిల్డింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ఇన్‌చార్జిగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎల్బీనగర్ డివిజన్లో పార్టీ కార్పొరేటర్ల విజయం కోసం పనిచేసినట్లుగా పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏ బాధ్యతను ఇచ్చినా విజయవంతంగా చేసిన తనకు గాని, తన సోదరుడు పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ బొజ్జ నాగరాజుకు గాని కొంతకాలంగా పార్టీలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, తనకు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా లేక రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించాలని లేఖలో కోరారు.
ఆయన లేఖ జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో రేగుతున్న వివాదాన్ని మరింత జఠిలం చేస్తుండగా, తెరవెనుక దాగిన అసమ్మతి కొత్త జిల్లా అధ్యక్షుడి పేరు ప్రకటన పిదప మరింత బహిర్గతమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారిని వదిలి, ఇతర పార్టీల వారితో లోపాయికారి వ్యవహారాలను నడుపుతున్న నాయకులకు పార్టీ పగ్గాలిస్తే పార్టీ విస్తరణ లక్ష్యం ఎలా నెరవేరుతుందంటూ అసమ్మతివాదులు ప్రశ్నిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ, మండల, గ్రామ కమిటీల అభిప్రాయాలను తీసుకొని నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాలని, ల్యాబీయింగ్ కు లోబడి ఎంపిక చేస్తే అసమ్మతి తప్పదన్న సంకేతాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నాయకుల నుండి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది.