మంచిర్యాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

  • By: Somu    latest    Dec 01, 2023 12:28 PM IST
మంచిర్యాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ప్రేమ్ సాగర్ రావు
  • ప్రజా సేవకుడిగా ఉంటా
  • 6 గ్యారెంటీల అమలు పక్కా
  • మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్లుగా రాజకీయాలకు సంబంధం లేకుండా కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ద్వారా ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈనెల 3న ఎన్నికల ఫలితాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు.


నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తానన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ప్రజాసేవకుడిగా ఉంటానన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీఆరెస్ పై విసిగి నియోజకవర్గంలో మార్పు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావడానికి కంకణబద్ధులు కావడం అభినందనీయమని కొనియాడారు. మంచిర్యాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తానని అన్నారు. ఇంద్రవెల్లి సభతో కాంగ్రెస్ కు మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాకూటమితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు.