Telangana | ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలె

Telangana విధాత : ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అసత్యాలు, అసందర్భ ప్రేలాపనలు. ప్రధాని వాస్తవాలు తెలుసుకోకుండా తెలంగాణపై అనేకసార్లు తన అక్కసును వెళ్లగక్కారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. పైగా ఎంతో ప్రయాసతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రక్తపుటేర్లు పారాయని అన్నారు. అసలు విభజనతో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్‌కానీ వేడుకలు చేసుకోలేక పోయాయని వక్రీకరణలకూ దిగారు. నిజానికి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెలువడిన తర్వాత ఇక్కడ వెల్లువెత్తిన సంబురాలు మోదీకి కనిపించలేదా? […]

  • By: Somu    latest    Sep 20, 2023 11:00 AM IST
Telangana | ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలె

Telangana

విధాత : ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అసత్యాలు, అసందర్భ ప్రేలాపనలు. ప్రధాని వాస్తవాలు తెలుసుకోకుండా తెలంగాణపై అనేకసార్లు తన అక్కసును వెళ్లగక్కారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. పైగా ఎంతో ప్రయాసతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రక్తపుటేర్లు పారాయని అన్నారు. అసలు విభజనతో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్‌కానీ వేడుకలు చేసుకోలేక పోయాయని వక్రీకరణలకూ దిగారు. నిజానికి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెలువడిన తర్వాత ఇక్కడ వెల్లువెత్తిన సంబురాలు మోదీకి కనిపించలేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.

తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అన్నది రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటునకు సుముఖతను వ్యక్తం చేస్తూ మ్యానిఫెస్టోలో పెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ చెప్పించింది. ఇక బీజేపీ అయితే అంతకుముందే 1997లో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని నినదించింది. అది ఆ పార్టీ విధానం అయి ఉంటే 2004 వరకు కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో ఉన్నది. 2001లో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ డిమాండ్‌ కూడా వచ్చింది.

నాటి కేంద్ర హోం మంత్రి ఎల్‌ కే అద్వానీ వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే.. రాజధాని ఉన్న ప్రాంతం రాష్ట్రం కోరడం ఏమిటని దాట వేసింది నిజం కాదా? నాడు తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయలేదంటే నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అడ్డుతగలడం వల్ల కాదా? ఒకవేళ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం కూలిపోతుందని వెనకడుగు వేసింది నిజం కాదా? మోడీ ఇన్ని వాస్తవాలను తొక్కిపెట్టి తామేదో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను ఉద్ధరిస్తున్నామన్నట్టు మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ 2004లో ఇచ్చిన హామీ మేరకు పదేళ్ల పాటు రాష్ట్ర విభజనపై ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వేసింది. వాటి ద్వారా రాష్ట్రంలోని పార్టీలతో పాటు కేంద్రంలోని పార్టీల అభిప్రాయాన్ని నాటి ప్రణబ్‌ముఖర్జీ కమిటీ సేకరించింది. తెలంగాణకు మద్దతుగా 36పైచిలుకు పార్టీలు మద్దతు తెలిపాయి. కేసీఆర్‌ నిరాహారదీక్ష సమయంలో డిసెంబర్‌ 9 ప్రకటనకు ముందు కూడా నాటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన సమావేశమైన అఖిలపక్ష భేటీలో (సీపీఎం, ఎంఐఎం) మినహా అన్నిపార్టీలు జై తెలంగాణ అన్నాయి.

నాటి సమావేశ తీర్మానం కూడా ఉన్నది. అలాగే నాడు కేంద్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ఏపీ పునర్విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీ పార్టీ లోక్‌సభ పక్ష నేత సుష్మా స్వరాజ్‌, రాజ్యసభ పక్ష నేత అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చెప్పారు. ఈ రికార్డులు భద్రంగానే ఉన్నాయి. లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఏపీకి చెందిన లగడపాటి రాజగోపాల్ తో పాటు మరికొందరు చర్చను అడ్డుకున్నారు.

లోక్‌సభలో సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి పెప్పర్‌ స్ప్రే లాంటివి ఉపయోగించారు. ఆ ఘటనలో నాటి ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లాంటి వాళ్లు గాయపడ్డారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. సభ పలుమార్లు వాయిదా పడినా చివరికి మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆ బిల్లును ఆమోదించింది. కానీ రాజ్యసభలో మాత్రం ఏపీ పునర్విభజన బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.

నాటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ను బిల్లుపై చర్చ మొదలుపెట్టాలని బీజేపీ ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్‌ పోడియం వద్దకు వెళ్లి అడిగిన రికార్డులు ఉన్నాయి. వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, అరుణ్‌జైట్లీ, సీతారాం ఏచూరి, నాటి కేంద్ర మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచందర్‌రావు సహా అనేకమంది ఆ చర్చలో పాల్గొన్నారు. ఆ రికార్డులు కూడా ఉన్నాయి.

మోదీ చెబుతున్న ఏకాభిప్రాయం అనే మాట ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఏర్పాటులోనూ వందశాతం సాధ్యం కాలేదు. నాడు ఆర్జీడీ అధినేత లాలు, ఉత్తరప్రదేశ్‌ విభజన సమయంలో ఎస్పీ, బీజేపీ నేతలు గొడవలు చేశారు. ఉత్తరాఖండ్‌ ఉద్యమకారులపై దాడులు చేశారు. మధ్యప్రదేశ్‌ విభజనపై కూడా వ్యతిరేకత వచ్చింది. అయినా చివరికి మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ప్రస్తుతం ఆ మాతృ రాష్ట్రాల, ఏర్పడిన రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉన్నది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు, పార్టీ అభిప్రాయం మేరకు రాష్ట్ర విభజన చేసింది కానీ మీలా ప్రజల మధ్య విభజన, విద్వేష రాజకీయాలు మాత్రం చేయలేదు. ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లలేదు. తొమ్మిదన్నరేళ్ల కాలంలో బీజేపీ నేతృత్వంలో తెచ్చిన వివిధ బిల్లులపై జరిగిన చర్చలు, వ్యవసాయ చట్టాల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో మీ ప్రభుత్వ వైఖరి దేశమంతా చూసింది.

కాంగ్రెస్‌ పార్టీ విభజన చేయడమే కాదు విభజన వల్ల నష్టపోయే ఏపీకి మేలు చేసే అనేక అంశాలను బిల్లులో పొందుపరిచింది. ఈ తొమ్మిదన్నరేళ్ల కాలంలో ఆ బిల్లులో పేర్కొన్నవాటిని అమలుచేయకుండా, అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించకుండా పూటకో మాట చెప్తూ కాలం వెళ్లదీసింది బీజేపీ సర్కారే.

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఇక్కడి ప్రజలు దశాబ్దాల పాటు త్యాగాలు చేశారు తప్పా ఎవరిపై దాడులు చేయలేదు. రాష్ట్ర ఉద్యమ సమయంలో గుజరాత్‌ వలె గోధ్రా లాంటి సంఘటనలు జరగలేదు. తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఇక్కడి ప్రజలు రాజీలేని పోరాటం చేశారు. ప్రజల పోరాటానికి తోడుగా రాజకీయ పార్టీలు తమ వంతు పాత్ర పోషించాయి.

రాష్ట్ర విభజన అన్నది రాజకీయ అంశంతో ముడిపడి ఉన్నందున ఆ ప్రక్రియను నాటి ఏపీలోని అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, పార్టీల వైఖరి తేలిన తర్వాతే అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకన్నది. తెలంగాణ అమరుల, వారి త్యాగాలను, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచేలా ప్రధాని మోడీ ఇప్పటికి అనేకసార్లు మాట్లాడారు. ప్రధాని మోడీ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు.