Priyanka Gandhi | అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని నులిమేశారు!

అధికారం కోసం నిబంధనలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు

  • By: Somu    latest    Jan 31, 2024 11:49 AM IST
Priyanka Gandhi | అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని నులిమేశారు!
  • బీజేపీపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శలు


Priyanka Gandhi | న్యూఢిల్లీ : అధికారం కోసం నిబంధనలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నులిమేసిన తీరు యావత్‌ దేశం చూసింది. నిబంధనలు, చట్టం, ప్రజాస్వామ్యం, దాని గౌరవం, రాజ్యంగాన్ని అధికారం కోసం పక్కన పెట్టేశారు. ఒక నగర వ్యవస్థలోనే ప్రతిపక్షం గొంతును బహిరంగంగా నొక్కేయడాన్ని ప్రజలు చూస్తున్నారు’ అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఒక స్థానిక సంస్థ ఎన్నికల్లోనే ఇలా చేశారంటే వారిని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనం ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ప్రజల్లో ఈ విషయంలో పెద్ద ఎత్తున సందేహాలు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం నాటి చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలకు చెందిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించడంతో మేయర్‌ పీఠం బీజేపీకి దక్కింది. నిజానికి ఇక్కడ ఆప్‌ అభ్యర్థి తగిన మెజార్టీతో గెలవాల్సి ఉన్నది. అయితే.. ప్రిసైడింగ్‌ అధికారి.. ఎనిమిది బ్యాలెట్‌ పత్రాలను ట్యాంపర్‌ చేశారని కాంగ్రెస్‌, ఆప్‌ ఆరోపించాయి.


ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాయి. ఫలితాలపై కోర్టును ఆశ్రయించాయి. అయితే.. ఎన్నికల ప్రక్రియను తప్పుదారి పట్టించేందుకే ఆప్‌, కాంగ్రెస్‌ కుట్ర చేశాయని ప్రిసైడింగ్‌ అధికారి అన్నారు. ఆప్‌ సభ్యులకు ఇచ్చిన 11 బ్యాలెట్‌ పత్రాల్లో సమస్య తలెత్తింది. వారి విజ్ఞప్తి మేరకు నేను వారికి కొత్త బ్యాలెట్‌ పత్రాలు అందించాను. ఓటింగ్‌ అనంతరం ఫలితాలు ప్రకటించాను. బీజేపీ అభ్యర్థికి 16, ఆప్‌ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. మిగిలిన 8 ఓట్లు చెల్లలేదు. నేను ఫలితాలు ప్రకటించగానే ప్రతిపక్షాలు ఆ ప్రక్రియను అడ్డుకుంటూ బ్యాలెట్‌ పత్రాలను హైజాక్‌ చేశాయి’ అని ఆయన వివరణ ఇచ్చారు.