మెట్రో పట్టాలపై పడ్డ పసిపాప.. తల్లి ఏం చేసిందంటే..?
ఆడుకుంటూ రైలు పట్టాలపై పడ్డ తన పసిబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది

పుణె : ఆడుకుంటూ రైలు పట్టాలపై పడ్డ తన పసిబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది. మెట్రో రైలు దూసుకువస్తుండడంతో ఆ తల్లి పట్టాలపైకి దూకి బిడ్డను కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలోని సివిల్ కోర్టు మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులందరూ మెట్రో కోసం వేచి చూస్తున్నారు. అయితే ఓ చిన్నారి ఆడుకుంటూ పట్టాల వైపు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆ పాప పట్టాలపై పడిపోయింది. మరో వైపు మెట్రో ప్లాట్‌ఫాం వద్దకు దూసుకువస్తోంది. దీంతో అప్రమత్తమైన తల్లి తన బిడ్డను ప్రాణాలతో రక్షించుకునేందుకు పట్టాలపైకి దూకింది.
అక్కడే ఉన్న మెట్రో స్టేషన్ సెక్యూరిటీ గార్డు వికాస్ బంగార్ ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాడు. దీంతో మెట్రో రైలు ప్లాట్‌ఫాంకు 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇక పట్టాలపై ఉన్న తల్లీబిడ్డను ప్రయాణికులు ప్లాట్‌ఫాంపైకి లాగారు. ఈ ఘటనలో తల్లీబిడ్డలకు ఎలాంటి గాయాలు కాలేదని మెట్రో అధికారులు తెలిపారు. చిన్న పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.