దొంగలతో బంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటు: ఉత్తమ్ ధ్వజం
విధాత: దేశ సంపదను ప్రధాని మోడీ దొంగలకు దోచి పెట్టారని వారితో మోడీకి ఉన్న సంబంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని పిసిసి మాజీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సుజాతను గురువారం హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిది ఏళ్లలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఆదాని, అంబానీ తదితరులకు దేశ సంపదను […]

విధాత: దేశ సంపదను ప్రధాని మోడీ దొంగలకు దోచి పెట్టారని వారితో మోడీకి ఉన్న సంబంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని పిసిసి మాజీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సుజాతను గురువారం హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
గత ఎనిమిది ఏళ్లలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఆదాని, అంబానీ తదితరులకు దేశ సంపదను ప్రధాని మోడీ అప్పనంగా కట్టబెట్టారన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కొల్లగొట్టి, ప్రభుత్వ సంస్థలను ఆక్రమించి దేశ సంపదను కాజేస్తున్న వారితో మోడీకి ఉన్న బంధం ఏమిటో విచారించేందుకు పార్లమెంటులో జేపీసీ వేయాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు.
రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేస్తూ, ప్రతిపక్షాలను అణిచివేసే చర్యలతో నియంతలా మారిన మోడీ ప్రజాస్వామ్య చర్యలను దేశ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీపై వేటును దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రానున్న రోజుల్లో కర్ణాటకతో మొదలయ్యే బిజెపి పతనం అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందని, కేంద్రంలో సైతం ఆ పార్టీ అధికారం కోల్పోక తప్పదు అన్నారు.
తెలంగాణలోనూ, కేంద్రంలోనూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మఠంపల్లిలో నలభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు తెలిపారు.