కొలువుల భర్తీకి తలుపులు తెరుస్తాం: రాహుల్‌గాంధీ

మోదీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి తలుపులు మూసేసిందని, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి తలుపులు తెరుస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ చెప్పారు.

కొలువుల భర్తీకి తలుపులు తెరుస్తాం: రాహుల్‌గాంధీ
  • ముఖ్యమైన పోస్టుల్లో వేల కొద్దీ ఖాళీలు
  • ‘ఇండియా’ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు
  • కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ప్రకటన

న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి తలుపులు మూసేసిందని, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి తలుపులు తెరుస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పోస్టుల్లో వేలకొద్దీ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా సమయాన్ని సాగదీస్తున్నదని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించి, ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంలో నరేంద్రమోదీ లేరని యువత గుర్తించాలని కోరారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు.


కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 78 విభాగాలలో తొమ్మిది లక్షల 64 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో హిందీలో ఒక పోస్టు పెట్టారు. ముఖ్యమైన విభాగ విభాగాల్లో ఖాళీలను సూక్ష్మంగా పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వేల్లో 2.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. హోం శాఖలో 1,43,000 పోస్టులు, రక్షణ శాఖ సంబంధిత విభాగాలలో దాదాపు రెండు లక్షల 64 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాహుల్‌ పేర్కొన్నారు.


చాలా ముఖ్యమైన 15 విభాగాలలో దాదాపు 30% పోస్టులు ఎందుకు ఖాళీగా పడి ఉన్నాయో మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలోనే అనేక ముఖ్యమైన పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయన్నారు. మోదీ గ్యారెంటీల పేరుతో ఒక తప్పుడు వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. తన శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేయలేని మోదీ మరొకవైపు మోదీ గ్యారెంటీల పేరుతో ప్రజలను, దేశ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా పడి ఉన్న పోస్టుల్లో భర్తీలను నిలిపివేసి, వాటి స్థానంలో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీలు చేపట్టి, దేశ యువతను అస్థిరతకు గురి చేస్తున్నదని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేకుండా, ఆత్మ గౌరవం లేకుండా గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. ‘ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనేది దేశ యువత జన్మహక్కు. దానికి కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఒక నిర్దిష్టమైన ముందుచూపుతో ఖాళీ పోస్టులను భర్తీ చేయటానికి తగిన ప్రణాళికను సిద్ధం చేశామ‌న్నారు.


ఇండియా కూటమి కచ్చితమైన పట్టుదలతో.. అధికారంలోకి రాగానే.. నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని చేపట్టి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. దేశ యువతకు న్యాయం చేకూరుస్తుంది’ అని యువతకు రాహుల్‌ హామీ ఇచ్చారు. అందుకు ఇండియా కూటమి ఎల్లవేళలా సంసిద్ధతతో, శక్తిమంతంగా కృషి చేస్తుందని కూడా ఆయన ప్రజలకు విశ్వాసాన్ని కల్పించారు. నిరుద్యోగ భూతం అనే చీకటిని చీల్చి చెండాడితే అప్పుడు ఉద్యోగాల వెలుగు రేఖలు వెదజల్లి యువతలో కొత్త ఆశలు చిగురిస్తాయని తన పోస్టులో రాహుల్‌ పేర్కొన్నారు.