రైలు ప్ర‌యాణికుల‌కు ఎలుక‌లు తిన్న ఆహారం!

రైలు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఇండియన్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) అందించే ఆహారం తింటున్నారా? ఒక్క‌సారి ఆలోచించండి

రైలు ప్ర‌యాణికుల‌కు ఎలుక‌లు తిన్న ఆహారం!
  • మధ్యప్రదేశ్‌లోని ఐఆర్సీటీసీ స్టాల్‌లో
  • ఆహారం తింటున్నఎలుక‌ల వీడియో వైర‌ల్‌
  • రైల్వేశాఖ తీరుపై నెటిజ‌న్ల మండిపాటు


విధాత‌: రైలు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఇండియన్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) అందించే ఆహారం తింటున్నారా? ఒక్క‌సారి ఆలోచించండి. తినే ముందు ఈ వీడియో చూడండి.. ఐఆర్‌సీటీసీ స్థాళ్ల‌లో ఆహార ప‌దార్థాల‌ను ఎలుక‌లు తింటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో రైల్వే ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు షాకింగ్ ఫుటేజీని చిత్రీకరించాడు. 37 సెకన్ల నిడివి గల వీడియోలో రైల్వే స్టేషన్‌లో నేలపై ఉన్న స్నాక్స్, ఫుడ్ కంటైనర్‌ ప్లేట్లలో ఎలుకలు చిందులు తొక్కుతున్నాయి. ఆహార ప‌దార్థాల‌పై ఎలుక‌లు అటూఇటూ తిరుగుతున్నాయి. ఆహార ప‌దార్థాల‌ను తింటున్నాయి.


ఇందుకు సంబంధించిన వీడియోను ఔత్సాహిక రైల్వే ప్ర‌యాణికుడు సౌర‌భ్ చిత్రీక‌రించాడు. సోష‌ల్ మీడియాలో పోస్టుచేయ‌డంతో అది కాస్త‌ వైర‌ల్‌గా మారింది. రైల్వే స్టేషన్ విక్రేతల నుంచి ఆహారం తీసుకునే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత అంశాలను తనిఖీ చేయాలని అత‌డు సూచించారు.


ఈ వీడియోపై నెటిజ‌న్ల ప‌లువురు స్పందించారు. ”ఐఆర్‌సీటీసీ ఆహార ప‌దార్థాల‌ను ఎలుక‌లు త‌నిఖీ చేస్తాయి. అందుకే నేను రైల్వే స్టేషన్ వెండర్ల నుంచి ఆహారాన్ని తినకుండా ఉంటా” అని ఎక్స్‌లో ఒక‌రు తెలిపారు.


వైరల్ వీడియోపై రైల్వే అధికారులు స్పందించారు. త‌క్ష‌ణ‌మే చర్య తీసుకుంటామని వినియోగదారుల‌కు హామీ ఇచ్చారు. ”దయచేసి మీ మొబైల్ నంబర్‌ను షేర్ చేయండి. మేము తక్షణం చర్యలు తీసుకోవడానికి వీలుగా మీరు నేరుగా http://railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు, త‌క్ష‌ణ పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు” అని రైల్వే సేవా పేర్కొన్న‌ది.