Game Changer: ‘గేమ్ ఛేంజర్’కు షాక్.. ప్రైవేట్ బస్సులో ఫ్రీ షో

విధాత: రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి నండుగ సరికొత్త శోభను తీసుకువచ్చింది. దీంతో హైదరాబాద్ నిర్మానుష్యం అవగా ఏపీ జన సందోహంతో సందడిగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరిం చుకుని ఎన్ని రైళ్లు, బస్సులు అదనంగా వేసినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కొందరు ప్రైవేటు వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు బస్సులు రెండింతలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ప్రయాణికుల నుంచి వారిని పూర్తిగా సంతృప్తి పరచాలని అనుకున్నారేమో ప్రయాణికులకు సరికొత్త సినిమాతో వినోదాన్ని పంచే ఏర్పాటు చేసి దిల్ రాజుకు షాకిచ్చారు.
అయితే.. ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అలరిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.270 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి జనం యావరేజ్ టాక్ వచ్చినా చూస్తారనే నమ్మకంతో ఉన్న నిర్మాతల ఆశలకు ప్రైవేటు బస్సు యాజమాన్యాలు గండి కొడుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏంచక్కా తమ బస్సులో ప్రదర్శిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఎక్కువ రేటు పెట్టి సినిమా చూసేకన్నా హాయిగా ఊరెళుతూ.. బస్సులో ప్రయాణిస్తూ కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికే తొలి రోజే హెచ్డీ ప్రింట్ మార్కెట్లో ప్రత్యక్షమవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
అయితే తాజాగా ఓ బస్సులో ఇలాంటి ఘటనే ఎదురవడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ రామ్ చరణ్ అభిమాని ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడంతో వెంటనే సదరు బస్సు సిబ్బంది, యాజమాన్యం అప్రమత్తమయ్యాయి. ఇదిలాఉండగా గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం వేధిస్తూ ఉంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. గతంలో వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ మూవీస్‌కు కూడా ఈ పైరసీ బాధలు తప్పలేదు. రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, సినిమా తీసిన నిర్మాతలు ఈ పైరసీతో ఎంతగా నష్టపోతున్నామో అంటూ నిర్మాతల మండలికి కంప్లైంట్స్ ఇస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. పైరసీ ఎక్కడ జరిగినా తమకు తక్షణమే సమాచారం ఇవ్వాలని చెర్రీ అభిమానులు ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నారు.