Revanth Reddy | జనం నమ్మేనా ! నిన్నటి దాకా తిట్లు.. నిరుద్యోగ సభలో పొగడ్తలు

Revanth Reddy , Nalgonda ఒక్కటై కదిలారు..  విస్మయం రేపిన కాంగ్రెస్ నేతల తీరు నల్గొండ నిరుద్యోగ సభ టీ-కాంగ్రెస్ సీనియర్లు విధాత: తెలంగాణ కాంగ్రెస్ లో నిన్నటిదాకా ఆ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డికి వ్యతిరేక జట్టు వారిది. కాంగ్రెస్ సీనియర్లు ఎంపీలు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నిన్నటిదాకా మా అనుమతి లేకుండా జిల్లాకు ఎలా వస్తావంటూ రేవంత్ ఉమ్మడినల్గొండ జిల్లా పర్యటనకు మోకాలోడ్డారు. కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి […]

Revanth Reddy | జనం నమ్మేనా  ! నిన్నటి దాకా తిట్లు.. నిరుద్యోగ సభలో పొగడ్తలు

Revanth Reddy , Nalgonda

  • ఒక్కటై కదిలారు..
  • విస్మయం రేపిన కాంగ్రెస్ నేతల తీరు
  • నల్గొండ నిరుద్యోగ సభ టీ-కాంగ్రెస్ సీనియర్లు

విధాత: తెలంగాణ కాంగ్రెస్ లో నిన్నటిదాకా ఆ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డికి వ్యతిరేక జట్టు వారిది. కాంగ్రెస్ సీనియర్లు ఎంపీలు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నిన్నటిదాకా మా అనుమతి లేకుండా జిల్లాకు ఎలా వస్తావంటూ రేవంత్ ఉమ్మడినల్గొండ జిల్లా పర్యటనకు మోకాలోడ్డారు.

కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యం దిశగా రేవంత్ సాగిస్తున్న పరుగుకు కాళ్లలో కట్టే మాదిరి అన్నట్లుగా ఆయనతో నిత్యం తగువులకు, తిట్ల దండకాలకు దిగారు. ఓ దశలో రేవంత్ హఠావో కాంగ్రెస్ బచావో అంటూ, ఒరిజినల్ కాంగ్రెస్ మాదేనంటూ కూడా రెచ్చిపోయారు.

రేవంత్ సైతం సీనియర్లకు చెక్ పెట్టేలా ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచి పోషించి అసమ్మతి శిబిరం బలోపేతానికి తన వంతు ఊతమిచ్చారు. అలాంటి సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు, రేవంత్ రెడ్డి (Revanth) పరస్పరం కాంగ్రెస్ పెద్దాయన కే. జానారెడ్డి సాక్షిగా ఒకటయ్యారు. ఇందుకు నలగొండ నిరుద్యోగ నిరసన సభ వేదిక అయింది.

అధికార బీఆర్ఎస్ నేతలు అన్నట్లుగా నిరుద్యోగ నిరసన సభ కాస్త కాంగ్రెస్ నేతల ఐక్యత చాటింపు వేదికగా మారిపోయింది. ఒకే పార్టీలో ఉన్నా ఎన్నడూ కలవనట్లుగా.. చాలాకాలం పిదప కలిసిన మాదిరిగా వేదికపై పరస్పర ఆలింగనాలు, పొగడ్తలతో తమ ఐక్యత సినిమాను సభకు హాజరైన జనం ముందు సక్సెస్ గానే ప్రదర్శించారు. సభకు హాజరైన కార్యకర్తలు, జనం కూడా నిత్యం తగువులాడే తమ అభిమాన నేతల ఐక్యత సినిమా సూపర్ హిట్ అంటూ తమ ఈలలు, కేకలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా ఏ రోజు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని ఏళ్ల తరబడిగా గమనిస్తున్న పార్టీ శ్రేణులు వారి ఐక్యత ఎంత కాలం ఉంటుందోనని సందేహిస్తున్నారు. ఇందుకు వారు గతంలో ప్రవర్తించిన తీరు ..చేసుకున్న విమర్శలే నిదర్శనం అంటున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాలతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తను ఖాళీ చేసిన మంత్రి పదవిని ఇదే జిల్లా సీనియర్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు.

దీంతో అప్పట్లో వెంకటరెడ్డికి ఉత్తమ్ కు మధ్య బహిరంగ సభలు, మీడియా సమావేశాల వేదికగా నువ్వు వెధవ అంటే నువ్వు వెధవ అంటూ తీవ్ర స్థాయిలో సాగించిన తిట్ల దాడిని యాదిలోకి తెచ్చుకుంటూ.. నిన్నటి సభలో పరస్పరం పొగుడుకున్న తీరును తలుచుకుంటూ తమ నేతల రాజకీయాలతో అయోమయానికి గురయ్యారు.

అప్పట్లో నా కాలి చెప్పుతో సమానమైన.. నేను వదిలేసిన మంత్రి పదవిని వెలగబెడుతున్నాడని, పైలెట్.. కెప్టెన్ అని చెప్పుకునే ఉత్తమ్ ఎప్పుడు యుద్ద విమానాలు నడపలేదంటూ ఉత్తమ్ పై వెంకటరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఇక పిచ్చోడు మతిలేనోడంటూ అప్పట్లో ఉత్తమ్ సైతం వెంకట్ రెడ్డి పై కౌంటర్ వేశారు.

ఇక నిన్నటి నలగొండ నిరుద్యోగ సభలో వెంకట్ రెడ్డి దేశం కోసం పోరాడిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, తామిద్దరం ఎంపీలుగా కలిసి జిల్లా అభివృద్ధికి పోరాడుతున్నామంటూ పొగిడారు. గతంలో ముదిమానం తప్పడంటూ జానారెడ్డిని విమర్శించిన వెంకట్ రెడ్డి నిన్నటి సభలో 20 ఏళ్ల సుదీర్ఘ మంత్రి అని, మచ్చలేని నాయకుడు అంటూ కొనియాడారు.

ఇక రేవంత్ రెడ్డిని తాము నలగొండకు రానిస్తలేరని ప్రచారం చేశారని, సమయం వచ్చినప్పుడు మేం పిలుచుకున్నామా లేదా అంటూ అవసరమైనప్పుడు ఐక్యంగా పనిచేస్తామన్నారు. నలగొండకు రేవంత్ రెడ్డి మనవడు పుట్టి తాత అయి వచ్చాడని, తాత అయినా పెళ్ళికొడుకుగా కనిపిస్తున్నాడంటూ ప్రేమ కుమ్మరిచేశారు. తాత అయిన రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపి చల్లగా ఉండాలన్నారు.

ఇక రేవంత్ రెడ్డి తనను మొన్నటిదాకా విమర్శించిన ఎంపీ ఉత్తమ్, వెంకటరెడ్డి లను, దామోదర్ రెడ్డిలను ఈ నిరుద్యోగ సభ వేదికగా ఆకాశానికి ఎత్తేశారు. సీనియర్ నేతలైన వారు మంత్రులు గా ఉన్నప్పుడు జిల్లా వాసులు ఎక్కడికి పనిమీద పోయిన అధికారులు కూర్చి వేసి గౌరవించి పనిచేసే పెట్టే వారన్నారు.

ఇప్పుడు సీఎం కేసీఆర్ బానిసలైన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నలగొండ జిల్లా ఇజ్జత్ తీస్తున్నారన్నారు. దామోదర్ రెడ్డిని పౌరుషానికి ప్రతీక అంటూ రేవంత్ కొనియాడారు. ఉత్తమ్ తెలంగాణ సాధన కోసం ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంకు అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రం కావాలంటూ నివేదిక ఇచ్చారన్నారు.

దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన యోధులు అంటూ పొగిడారు. ఇక తొలి దశ ఉద్యమంలో తెలంగాణ వచ్చేదాకా తనకు ఏ పదవి వద్దని చెప్పి మళ్లీ ఏ పదవి తీసుకొని త్యాగమూర్తి ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజి తో వెంకటరెడ్డిని పోల్చిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ సాధన కోసం మంత్రి పదవి త్యాగం చేశారంటూ కొనియాడారు.

ఉద్యమంలో తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలను చూడలేక, ఆంధ్ర పాలకుల అడుగుల మడుగులోత్తలేక మీ అభిమాన నాయకుడు, సోదరుడు వెంకటరెడ్డి మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని విసిరేసి మల్ల పదవిని తీసుకోకుండా త్యాగం చేశారని రేవంత్ ప్రశంసించారు. తొల దశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్, మలిదశలో వెంకటరెడ్డి పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకులని గర్వంగా చెబుతున్నాను అంటూ పొగిడారు.

ఈ రీతిన నలగొండ నిరుద్యోగ నిరసన సభ వేదికగా రేవంత్, సీనియర్లు పరస్పరం చేసుకున్న పొగడ్తల ఘట్టం ఎన్నాళ్లు చెదిరిపోకుండా ఉంటుందో మునుముందు తేలనుంది.