గ్ర‌హాల అనుకూల‌త వ‌ల్లే రేవంత్ అఖండ విజ‌యం.. ఇదీ ఆయ‌న జాత‌కం..!

రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.

  • By: Somu    latest    Dec 04, 2023 10:44 AM IST
గ్ర‌హాల అనుకూల‌త వ‌ల్లే రేవంత్ అఖండ విజ‌యం.. ఇదీ ఆయ‌న జాత‌కం..!

విధాత‌: రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఎందుకంటే రాజ‌కీయంగా త‌న‌ను ఎవ‌రూ ఢీకొట్టలేర‌ని భావించే క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్‌రావును ఒంటి చేత్తో ఓడించి, తెలంగాణ గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేసిన చ‌రిత్ర రేవంత్‌ది. న‌ల్ల‌మ‌ల్ల అడవుల్లోని కొండారెడ్డిప‌ల్లె అనే చిన్న ఊరిలో త‌న రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి.. ఏకంగా కుంభస్థలాన్నే కొట్టారు.


కేసీఆర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని, ఆయ‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ఎక్క‌డిక‌క్క‌డ చెక్‌పెడుతూ అఖండ విజ‌యం సాధించారు. కాంగ్రెస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. ముఖ్య‌మంత్రి పీఠానికి రేవంత్‌ దగ్గరగా వచ్చారు. ఇదంతా రేవంత్‌లో ఉన్న ఆత్మ విశ్వాసం, పోరాట‌త‌త్వంతో పాటు గ్ర‌హాల అనుకూల‌త కూడా అఖండ విజ‌యానికి కార‌ణ‌మైంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


ఇదీ రేవంత్ రెడ్డి జాత‌కం..


రేవంత్ రెడ్డి నక్షత్రం – చిత్త

రాశి – తులా రాశి

ఏడో స్థానంలో గురుడు ( బృహస్పతి)


జాతకంలో గురుబలం బలంగా ఉంటే విశేషమైన బలం, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే చాకచక్యం వస్తుంది. సమస్యలకి త‌లొంచ‌కుండా, ఆత్మ‌విశ్వాసంతో దూసుకెళ్లే ఆలోచన కలుగుతుంది. రేవంత్ లో ఈ తీరు స్పష్టంగా కనిపిస్తుంది.. ఎందుకంటే ఏడో స్థానంలో గురుడు సంచ‌రిస్తున్నాడు కాబ‌ట్టి.


కుజుడి ప్ర‌భావం త‌గ్గ‌డంతో..


అయితే తులారాశికి అధిప‌తి శుక్రుడు. శుక్రుడు కూడా రాజ‌యోగాన్ని, వైభోగాన్ని క‌ల్పిస్తాడు. ఇదే శుక్ర‌బ‌లం రేవంత్‌ను ముఖ్య‌మంత్రిగా చేసి, రాజ‌యోగాన్ని ఇచ్చింది. ఇక చిత్త న‌క్ష‌త్రానికి అధిప‌తి కుజుడు. కుజుడు ఏ జాతకుడికి అయినా ఏడేళ్ల పాటూ ఉహించనంత దెబ్బకొట్టి, మళ్లీ కోలుకుంటారో లేదో తెలియనంత ఇబ్బందులకు గురిచేస్తాడు.


ఆ తర్వాత ఊహించనంత ఉపశమనం ఇస్తాడు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా రేవంత్ ఎదుర్కోని ఇబ్బంది లేదు.ఓటు నోటు కేసు నుంచి మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఆయ‌న రాజ‌కీయ జీవితం నుంచి వైదొల‌గుతార‌ని అనుకున్నారు. కానీ ఈ రోజు ఈ ఏడాది కుజుడి ప్రభావం తగ్గడంతో పాటూ ఊహించనంత ఉపశమనం లభించింది.


శ‌ని ప్ర‌భావం కూడా అంతంత మాత్ర‌మే..


చిత్త‌ నక్షత్రం, తులారాశి వారికి ప్రస్తుతం శని ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు. శని జన్మంలో, అష్టమంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాడు. కానీ ఐదో స్థానంలో ఉన్నప్పుడు శనిప్రభావం అంతగా ఉండదు. పైగా గురువు, శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శని ప్రభావం అంతంత మాత్రమే. ఇది కూడా రేవంత్ రెడ్డికి క‌లిసొచ్చింది. ఇక శుక్రుడి సంచారం మంచిగా ఉంటే.. ఎవ‌రి జీవితంలోనైనా సంప‌ద‌, శ్రేయ‌స్సు, రాజ‌యోగం ఉంటుంది.


రాజ‌కీయ జీవితం కూడా బాగుంటుంది. బృహ‌స్ప‌తి మంచి స్థానంలో విద్య, సమాజంలో ఉన్నతస్థానం, వివాహం, పిల్లలు, దాంపత్యానికి సంబంధించి శుభఫలితాలు ఇస్తుంది. ఇక మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డికి…రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత, తన పట్టుదల, కష్టపడే తత్వంతో పాటూ గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూలించాయ‌న‌డంలో సందేహం లేనే లేదు.