టూరిస్ట్ సఫారీ వెహికిల్‌ను 1.5 కిలోమీటర్లు వెంబడించిన ఖడ్గ మృగం.. వీడియో
ఆ మొన్న ఓ భారీ ఏనుగు టూరిస్టులను వెంబడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఖడ్గ మృగం పర్యాటకుల సఫారీ వాహనాన్ని వెంబడించింది

ఆ మొన్న ఓ భారీ ఏనుగు టూరిస్టులను వెంబడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఖడ్గ మృగం పర్యాటకుల సఫారీ వాహనాన్ని వెంబడించింది. అదేదో ఐదారు మీటర్ల దూరం కాదు.. ఏకంగా 1.5 కిలోమీటర్ల దూరం ఆ ఖడ్గ మృగం సఫారీ వెహికిల్‌ను వెంబడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఘటన అసోంలోని మానస్ నేషనల్ పార్కులోని బన్స్‌బరి ఫారెస్ట్ జోన్‌లో చోటు చేసుకుంది. అయితే ఎప్పుడు చోటు చేసుకుందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. టూరిస్టులను ఖడ్గ మృగాలు వెంబడించడం ఇదే తొలిసారి కాదు. 2022లో ఇదే అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో సఫారీ జీపును ఖడ్గ మృగాలు వెంబడించాయి. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది.
మానస్ నేషనల్ పార్కు 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ పార్కు హిమాలయాల దిగువన ఉంది. భూటాన్ సరిహద్దుకు సమీపంలో ఈ పార్కు ఉంది. ఈ పార్కులో క్షీరదాలు, పక్షులు, పులులు, సరీసృపాలు ఉన్నాయి.