ఓవైసీ హైదరాబాద్ వదిలి పోటీ చేస్తారా?: రియాజ్

- పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్
విధాత, హైదరాబాద్: ‘రాహుల్ గాంధీకి దేశంలో ఎక్కడైనా పోటీ చేసే శక్తి ఉంది.. ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీకి హైదరాబాద్ వదిలి వేరే చోట పోటీ చేసే ధైర్యం ఉందా? అంటూ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి రియాజ్ ప్రతి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి పోటీ చేయాలనీ ఎంపీ అసదుద్దీన్ సవాల్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ వదిలితే అసదుద్దీన్ చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఒవైసీ విమర్శిస్తున్నారంటే, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారనే అర్థమని తెలిపారు. ఎంఐఎం పార్టీది ఊడిగం చేసిన చరిత్ర అని మండిపడ్డారు. అప్పుడు నిజాం, ఇప్పుడు కేసీఆర్ కి ఊడిగం చేస్తున్నదని ఆరోపించారు.
ఏంఐఎం రజాకార్ల వారసత్వ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు చూస్తున్నారని, ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు గొట్టాలని చూస్తున్నారనీ ధ్వజమెత్తారు. భారత్ జోడోయాత్ర ద్వారా దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలిపారు.
ఏంఐఎం అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బీ టీంగా పనిచేస్తున్నదని విమర్శించారు. పాతబస్తీలో అభివృద్ధి లేదు, యువతను అణిచివేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నిఖార్సైన సెక్యులర్ పార్టీ అని, సెక్యులర్ సమాజం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని కోరారు.