మారనున్న రోస్టర్ పాయింట్లు.. నోటిఫికేషన్లు మరింత ఆలస్యం
పెంచిన రిజర్వేషన్లు.. మారనున్న రోస్టర్ పాయింట్లు ఆలస్యం కానున్న నోటిఫికేషన్ల ప్రకటనలు విధాత: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన కొత్త చర్చకు దారితీస్తున్నది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన 80 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న ప్రకటన నెమ్మదిగా నడుస్తున్నది. ఇప్పటి వరకు 20,192 పోస్టులకే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అందులో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే 17,516 ఎస్సై, […]

- పెంచిన రిజర్వేషన్లు.. మారనున్న రోస్టర్ పాయింట్లు
- ఆలస్యం కానున్న నోటిఫికేషన్ల ప్రకటనలు
విధాత: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన కొత్త చర్చకు దారితీస్తున్నది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన 80 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న ప్రకటన నెమ్మదిగా నడుస్తున్నది. ఇప్పటి వరకు 20,192 పోస్టులకే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
అందులో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే 17,516 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రిలీమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. టీఎస్ పీఎస్సీ 2,676 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులన్నింటిని పాత రోస్టర్ ప్రకారం కేటగిరీల వారీగా కేటాయించారు. ఏఈ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్, సీడీపీఓ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసి, ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నది. దరఖాస్తు చేసుకునే నాటికే రిజర్వేషన్ పెంపు అమల్లోకి వచ్చినందున.. తమకు కేటాయించిన పోస్టులు ఇంకా పెరుగుతాయా లేదా అనే కన్ఫ్యూజన్ లో గిరిజన అభ్యర్థులు ఉన్నారు.
అయితే ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరిస్తున్న పోస్టులకు, ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు వర్తించే విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం నిరుద్యోగుల్లో ఈ కన్ఫ్యూజన్‌కు కారణం. అయితే టీఎస్పీఎస్సీ వర్గాలు మాత్రం పాత నోటిఫికేషన్లకు ఈ జీవో వర్తించదని, ఇక ముందు విడుదలయ్యే నోటిఫికేషన్లకే ఈ జీవో వర్తిస్తుందని పేర్కొంటున్నాయి.
అలాగే ఇంకా సుమారు 60 వేల పోస్టుల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2, 3 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికి అనేక సార్లు ప్రకటించింది. ఈ సమయంలో పెంచిన గిరిజనులకు రిజర్వేషన్లు అక్టోబర్ 1 నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది.
పైన పేర్కొన్న సందేహాలు, మారనున్న రోస్టర్ పాయింట్లు వంటి సమస్యలతో పాటు పోస్టులు భర్తీ చేసే నాటికి పాత నోటిఫికేషన్లపై లీగల్ సమస్యలు తలెత్తవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే కొలువుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదని నిపుణులు అంటున్నారు.
అమలు కానున్న కొత్త రోస్టర్
రాష్ట్రంలో ఇక నుంచి కొత్త రోస్టర్ అమలు కానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 100 పాయింట్ రోస్టర్ లో 8, 25, 33, 58, 75, 83వ పాయింట్లలో ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. పెరిగిన కోటా ప్రకారం.. ఓపెన్ కేటాగిరీలో ఉన్న మరో నాలుగు పాయింట్లను ఎస్టీ కేటాగిరీగా చూపనున్నారు.
ఇకపై విడుదల కానున్న జాబ్, అడ్మిషన్ నోటిఫికేషన్లలో కొత్త రోస్టర్ ప్రకారమే ఆయా కేటగిరీలకు పోస్టులు రిజర్వ్ చేయనున్నారు. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నోటిఫికేషన్లు, తుది దశలో ఉన్న నోటిఫికేషన్లలో కొత్త రోస్టర్ ప్రకారం మార్పులు చేయాల్సి ఉంది.
ఇక మీదట ప్రతి 100 పోస్టుల్లో 10 పోస్టులు గిరిజనులకే దక్కనున్నాయి. ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపిన గురుకుల, గ్రూప్ 2,3 నోటిఫికేషన్లతో పాటు ఇంకా ఆమోదం తెలపాల్సినవి కలిపి ఇంకా 59,847 పోస్టులకు నోటిఫికేషన్లు రావాల్సి ఉన్నది.
అన్ని నోటిఫికేషన్లు వస్తే పెరిగిన రిజర్వేషన్ ప్రకారం సుమారు 6 వేల పోస్టులు గిరిజనులకు అవకాశం లభించనున్నది. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో భర్తీ చేయబోయే సుమారు 4 వేల మెడికల్ సీట్లలో 400 సీట్ల వరకు గిరిజన విద్యార్థులకే దక్కనున్నాయి.