నగల షాపులో భారీ చోరీ.. 25 కోట్ల విలువైన ఆభరణాల లూటీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భోగల్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఉమరావ్ జువెలరీ దుకాణంలో దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయంలో ఫిర్యాదు అందగానే పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నేరస్థుల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
నగల దుకాణం గోడలకు రంథ్రం చేసిన దొంగలు.. లోనికి చొరబడి నగలు ఎత్తుకెళ్లారని షాపు యజమాని సంజీవ్ జైన్ తెలిపారు. పై అంతస్థు నుంచి లోనికి ప్రవేశించి, దాదాపు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు లూటీ చేశారని చెప్పారు.
కాగా.. చోరీ అనంతరం ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకుండా దొంగలు జాగ్రత్తపడ్డారని, సీసీ టీవీ కెమెరాలను కూడా నాశనం చేశారని తెలిపారు. ఢిల్లీ తూర్పు-దక్షిణ ప్రాంత డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో జరిగిన పెద్ద చోరీ ఇదేనని చెప్పారు. అన్ని ప్రయత్నాలూ చేసి దొంగలను పట్టుకుంటామని తెలిపారు.