Nirmal: కాంగ్రెస్ పార్టీకి షాక్.. హస్తానికి హ్యాండిచ్చి.. కమలంతో దోస్తీ కట్టిన ఏలేటి
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పాదయాత్రలతో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో పార్టీ వీడిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఏలేటి పార్టీ మార్పుతో నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌లో అనిశ్చితి విధాత: నిర్మల్ రాజకీయాల్లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వీడి కమలం గూటికి చేరాడు. నిర్మల్ రాజకీయాల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దీటుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి […]

- ఉమ్మడి ఆదిలాబాద్‌లో పాదయాత్రలతో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ
- ఈ క్రమంలో పార్టీ వీడిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి
- ఏలేటి పార్టీ మార్పుతో నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌లో అనిశ్చితి
విధాత: నిర్మల్ రాజకీయాల్లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వీడి కమలం గూటికి చేరాడు. నిర్మల్ రాజకీయాల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దీటుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఏలేటి మూడు రోజుల సస్పెన్స్ తెర వీడి కమలం పార్టీలో కలిశాడు.
ఒకపక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడోలో భాగంగా పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన కీలక నేతగా ఉన్న ఏలేటి పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్న నేపథ్యంలో ఉన్నఫలంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏలేటి కాంగ్రెస్ పార్టీకి హాండ్ ఇచ్చి కమలం గూటికి చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నిరాశ ఏర్పడింది.
గత మూడు రోజుల నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసుకు ధీటుగా ఎందుకు నోటిస్ ఇస్తున్నారో తెలపాలని ప్రశ్నించడంతోపాటు నాకు నోటీసు ఇవ్వాలంటే ఏఐసీసీ ఇవ్వాల్సిందే తప్ప రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఎవరని ప్రశ్నించారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. తనను పార్టీ నుండి బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కొత్తగా వచ్చిన వారు పార్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహేశ్వర్ రెడ్డి ఇక పార్టీ మారడం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చూగ్ తో సమావేశమై బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాంగ్రెస్ హస్తం వీడి కాషాయ తీర్థం పుచ్చుకున్నాడు.
ఎన్నికల సమయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరడం నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.