మూవీ పేరు: ‘సార్’ విడుదల తేదీ: 17 ఫిబ్రవరి, 2023 నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయికుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది తదితరులు. కెమెరా: జె. యువరాజ్ ఎడిటింగ్: నవీన్ నూలి మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు: ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి విధాత, సినిమా: ఇప్పుడు సినిమా అనేది గ్లోబల్ స్థాయికి చేరింది. ముఖ్యంగా సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో తయారవుతూ.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. […]
మూవీ పేరు: ‘సార్’
విడుదల తేదీ: 17 ఫిబ్రవరి, 2023
నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయికుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది తదితరులు.
కెమెరా: జె. యువరాజ్
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
విధాత, సినిమా: ఇప్పుడు సినిమా అనేది గ్లోబల్ స్థాయికి చేరింది. ముఖ్యంగా సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో తయారవుతూ.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2, కెజియఫ్, కాంతార వంటి చిత్రాలు సౌత్ సినిమా స్థాయి ఇదని ప్రపంచానికి పరిచయం చేశాయి. దీంతో ఇతర ఇండస్ట్రీ హీరోలు కూడా ఇప్పుడు సౌత్‌పై కన్నేసి.. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
VBVK REVIEW: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రివ్యూ: విష్ణు కథలో ట్విస్ట్లదిరాయ్
ఇక సౌత్‌కి చెందిన హీరోలు కూడా.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో అన్ని ఇండస్ట్రీలకి తమ పరిధిని విస్తరించాలని చూస్తున్నారు. ఈ లిస్ట్‌లో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ పరీక్ష పాసయ్యాడు. ఇప్పుడు టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ‘రఘువరన్ బి.టెక్’ నుంచి ధనుష్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. అప్పటి నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవడమో.. లేదంటే వేరే హీరో రీమేక్ చేయడమో జరుగుతూ వస్తుంది.
అయితే తెలుగుపై ఉన్న ప్రేమతో స్ట్రయిట్ చిత్రం చేయాలని చూస్తున్న ధనుష్‌కి.. ‘సార్’ రూపంలో చక్కని అవకాశమిచ్చాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ధనుష్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నట్లుగా.. ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్‌లో మేకర్స్ చెబుతూ వచ్చారు. అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి కూడా వరుణ్ తేజ్‌తో చేసిన ‘తొలిప్రేమ’ తర్వాత సరైన హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించినంతగా వర్కవుట్ కాలేదు.
దీంతో ఈ ‘సార్’ చిత్రం అతని కెరీర్‌కి చాలా ముఖ్యమైన చిత్రంగా మారింది. టాలీవుడ్లో అగ్రగామి సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం, ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్.. అలాగే ముందుగానే వేసిన ప్రీమియర్స్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో.. ‘సార్’ క్రేజ్ అమాంతం పెరిగింది. మరి ఆ క్రేజ్‌కి తగినట్లుగా ఈ సినిమా ఉందో? లేదో? సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
2000వ సంవత్సరం.. అభివృద్ధి పథంలోకి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న భారతదేశం. అంతా ఇంజినీరింగ్ చదువులపై దృష్టి సారిస్తున్న టైమ్ అది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా కమర్షియల్ అవడం మొదలైన సమయం కూడా అదే. కొందరు ప్రైవేట్ విద్యా సంస్థలు స్థాపించి.. విద్యను అమ్ముకుని క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టడంతో.. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం, కమర్షియల్ అవడం, పేద విద్యార్థులకి సరైన విద్య అందకుండా పోవడం.. వంటివి మొదలయ్యాయి.
దీనినే హైలెట్ చేస్తూ ఈ సినిమా కథ సాగింది. ప్రైవేట్ కాలేజీలు స్థాపించి.. వాటి అధ్యక్షుడిగా అనేక రూపాలలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించే త్రిపాఠి (సముద్రఖని).. గవర్నమెంట్ కాలేజీలలో చదువు చెప్పే వారికి డబ్బు ఆశ చూపి.. వారందరినీ తన కాలేజీలకు వచ్చేలా చేసుకుంటాడు.
దీంతో గవర్నమెంట్ కాలేజీలలో చదువు చెప్పే సరైన సార్స్ కరువయ్యేలా చేస్తాడు. మళ్లీ తనే గవర్నమెంట్ కాలేజీలను దత్తత తీసుకున్నట్లుగా ప్లాన్ చేసి.. డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో తన కాలేజీలలోని జూనియర్ లెక్చరర్స్‌ని.. గవర్నమెంట్ కాలేజీలకు పంపించి ఆ వ్యవస్థనే నాశనం చేయాలని చూస్తాడు.
ఈ క్రమంలోనే సిరిపురం అనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌కి జూనియర్ లెక్చరర్‌గా వెళతాడు బాల గంగాధర తిలక్ (ధనుష్). ఆయన్ని అందరూ బాలు సార్ అని పిలుస్తుంటారు. సిరిపురం వెళ్లిన బాలు సార్‌కి అక్కడి పరిణామాలు, త్రిపాఠి ప్లాన్ అర్థమవుతుంది. సిరిపురం కాలేజ్‌లో వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి.. గవర్నమెంట్ కాలేజ్లని బ్రతికించాలని చూసిన బాలు సార్‌కి అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి.
అవేంటి? వాటిని బాలు సార్ ఎలా ఎదుర్కొన్నాడు? గవర్నమెంట్ కాలేజ్‌ల భవితని ఆయన ఎలా కాపాడాడు? ఈ క్రమంలో బయాలజీ లెక్చరర్ అయిన మీనాక్షి (సంయుక్తా మీనన్) అతనికి ఎలా సాయం చేసింది? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? సిరిపురం సర్పంచ్ (సాయికుమార్) ఈ కథలో ఎలా భాగమయ్యాడు? తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో ఎలా ఆలోచిస్తారు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ ‘సార్’ కథ.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ముందుగా ఈ కథని ఓకే చేసిన ధనుష్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. దర్శకుడు కూడా ధనుష్ మాత్రమే కావాలని ఎందుకు పట్టుబట్టాడో.. సినిమా చూస్తే తెలుస్తుంది. బాలు సార్‌గా ధనుష్ అన్ని ఎమోషన్స్‌ని ఇందులో పలికించాడు. జాతీయ ఉత్తమ నటుడాయన. లెక్చరర్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. అతను చేసిన మంచి పాత్రలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి ఉండనే ఉండదు.
తెలుగు వాళ్లకి ధనుష్ రిజిస్టర్ అయినట్లే. బయాలజీ లెక్చరర్‌గా చేసిన సంయుక్తా మీనన్‌కు చాలా మంచి పాత్ర పడింది. అందంగా ఉండటమే కాదు.. ఆమె పాత్ర కూడా చాలా హుందాగా నడిచింది. చూపులతోనే ప్రేక్షకులని తినేస్తుంది. అంత చక్కగా సంయుక్త ఈ సినిమాలో కనిపించింది. సముద్రఖని పాత్ర కొత్తగా ఉన్నప్పటికీ.. ఆయన నటన మాత్రం ఇంతకు ముందు చేసిన సినిమాలలోలానే ఉంటుంది.
సిరిపురం సర్పంచ్‌గా చేసిన సాయికుమార్‌కి మంచి సన్నివేశాలు పడ్డాయి. హైపర్ ఆది పంచులు కూడా బాగానే పేలాయి. ఇంకా తనికెళ్ల భరణితో పాటు ఇతర పాత్రలలో చేసిన వారంతా కూడా వారి పాత్రల పరిధిమేర నటించి.. సినిమాకు ప్లస్ అయ్యారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాని ఎక్కడో నిలబెట్టాడని చెప్పుకోవచ్చు. నేపథ్య సంగీతం, పాటలు.. ఇలా ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సాంకేతికంగా సినిమా సక్సెస్‌కి ప్రధాన భూమిక పోషించాడు. అలాగే నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఇంకా కెమెరామెన్ యువరాజ్ వర్క్ కూడా హైలెట్. ఎడిటింగ్ పరంగా అక్కడక్కడ కాస్త కత్తెర పడాల్సిన సీన్స్ ఉన్నాయనిపిస్తుంది.
ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు రాసుకున్న కథకి పర్ఫెక్ట్గా నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్టయ్యారు. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. వెంకీ రాసుకున్న కథ.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో ఎలా ఆలోచిస్తారనే పాయింట్.. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించేదిగా ఉంది.
విశ్లేషణ:
దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథ.. ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి చెంపపెట్టులా ఉంది కానీ.. కథనం పరంగా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. 2000వ సంవత్సర కాలానికి చెందిన సినిమాగా ఈ కథ నడిచినా.. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితులు ఉండటంతో.. సహజంగానే సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఫీజుల విషయంలో తల్లిదండ్రులందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి.. ప్రతి ఒక్కరినీ ఈ పాయింట్ కదిలిస్తుంది.
అయితే ఫస్టాఫ్ అంతా సందడితో పాటు భావోద్వేగాలు నింపిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం డ్రామాతో పాటు సెంటిమెంట్ సన్నివేశాలను బాగా దట్టించాడు. సెకండాఫ్ పరంగా మాత్రం కాస్త లాజిక్ లెస్ సీన్లతో.. సాగదీసినట్లుగా సినిమా సాగింది. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్.. అంతగా రుచింపదు. మొదటి నుంచి ఒక సమస్య మీద నడిచిన చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చే సరికి తేలిపోయింది.
అయితే మధ్యలో అబ్దుల్ కలామ్ జీవిత కథ, విద్యార్థుల మధ్య వచ్చే కుల పోరుని తొలిగించే సన్నివేశాలు ఆకట్టుకున్నా.. అంత లాజిక్‌గా అనిపించవు. ఓవరాల్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్, మధ్య తరగతికి చెందిన విద్యార్థుల చదువును బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం.. అనుకున్నంత స్థాయిలో అయితే లేదని చెప్పొచ్చు. అలా అనీ పక్కన పెట్టే చిత్రం అయితే కాదు. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన చిత్రంగా ‘సార్’ని ‘లెక్క’లోకి తీసుకోవచ్చు. ఇంకాస్త లోతుగా విశదీకరించే అవకాశం ఉన్నా.. దర్శకుడు పైపైనే తేల్చేశాడని అనిపిస్తుంది.
చదువు అనేది ప్రసాదం వంటిది.. పది మందికి పంచిపెట్టాలి కానీ.. ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే పదార్థంగా చూడకూడదనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం. కాన్సెఫ్ట్, ధనుష్ నటన, అలాగే సంయుక్త గ్లామర్-నటన, ఫస్టాప్‌లో వచ్చే సన్నివేశాలు.. ఇంకా ధనుష్ ఊరు వదిలి వెళ్లేబోయే సన్నివేశం.. సినిమా చూస్తున్నవారికి బాగా నచ్చుతాయి. మాస్టారు మాస్టారు పాట.. థియేటర్ బయటికి వచ్చిన తర్వాత కూడా హంట్ చేస్తుంటుంది. మొత్తంగా అయితే.. ఈ ‘సార్’ క్లాస్‌కి ఆడియన్స్ మంచి మార్కులే వేసే అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ క్లాస్ రాదు కానీ.. పాస్ మార్కులు అయితే పక్కాగా వస్తాయి.
ట్యాగ్‌లైన్: ఈ ‘సార్’ క్లాస్‌కి పాసవుతారంతే.. ఫస్ట్ క్లాస్ కష్టం
రేటింగ్: 2.75/5