Sithakka | రైతుల సమస్యలపై కాంగ్రెస్ వినూత్న నిరసనకు పిలుపు
Sithakka ఈ నెల 20న కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కెసిఆర్ చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రూపాయి పరిహారం ఇవ్వలేదు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏదైనా సమస్య మీద నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు […]

Sithakka
- ఈ నెల 20న కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం
- రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
- కెసిఆర్ చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్
- అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రూపాయి పరిహారం ఇవ్వలేదు
- పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
- ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏదైనా సమస్య మీద నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు రాజకీయపక్షాలు ధర్నా, రాస్తారోకో, ఇతర నిరసన ప్రదర్శనలు చేయడం సహజం. కానీ దీనికి భిన్నంగా ములుగు జిల్లాలో రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 20న ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే సీతక్క గురువారం ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
దీనికి ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కిసాన్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్య కర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు
తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన
1200 మంది ప్రాణ త్యాగాలను చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వచ్చిన తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని సీతక్క విమర్శించారు. రైతులను మోసం చేస్తూ అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్య మంత్రి కెసిఆర్ రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రెండవ స్థానం లో ఉన్నామని సీతక్క అన్నారు.
20న మెగా రక్తదాన శిబిరం
ఈ నెల 20 న రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ములుగులో చేపడుతున్న మెగా రక్త దానం శిబిరం నిర్వహిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని, రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర యేండ్లు గడిచినా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.
రైతు రుణమాఫీ లేదు, పంట నష్ట పరిహారం లేదు, పండించిన పంటలను కొనడం లేదు, పండించిన పంటకు గిట్టు బాటు ధర లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, కల్తీ ఎరువులు, పురుగు మందులు, కల్తీ విత్తనాలు ఇలా అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల కాలంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులను అదుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆత్మ హత్యలు చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురండి
రైతు ప్రభుత్వం రావాలంటే, రైతును రాజును చేయాలంటే, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండంటూ సీతక్క విన్నవించారు. ఈ నెల 20 న ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మెగా రక్త దానం శిబిరం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకుతోట చంద్ర మౌళి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్, మండల ఉపాధ్యక్షులు అర్షం రఘు, పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా నాయకులు చింత నిప్పుల భిక్షపతి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్, మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్, జిల్లా నాయకులు ల్యాద శ్యామ్ రావు, కవ్వం పెల్లి సారయ్య, కొండల్ రెడ్డి, ఓరుగంటి అనీల్, కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.