ఓరుగల్లుకు.. బడ్జెట్‌లో మొండి చేయి!

చట్టాన్ని ఉత్తమాట చేసిన BJP ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని నష్టం కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల విమర్శలు విభజన హామీలకు చెల్లు చీటీ అభివృద్ధి లక్ష్యంగా సీపీఐ లాంగ్ మార్చ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టానికి అధికార బిజెపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. తొమ్మిదేళ్లుగా ఇగో అగో […]

ఓరుగల్లుకు.. బడ్జెట్‌లో మొండి చేయి!
  • చట్టాన్ని ఉత్తమాట చేసిన BJP
  • ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని నష్టం
  • కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల విమర్శలు
  • విభజన హామీలకు చెల్లు చీటీ
  • అభివృద్ధి లక్ష్యంగా సీపీఐ లాంగ్ మార్చ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టానికి అధికార బిజెపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. తొమ్మిదేళ్లుగా ఇగో అగో అంటూ చట్టంలో ఇచ్చిన హామీలను రాజకీయ విమర్శలుగా మార్చి రాష్ట్రం, కేంద్రం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజలను వంచిస్తున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై పెట్టుకున్న ఆశలు మరోసారి అడియాశలయ్యాయి.

కేంద్ర బడ్జెట్ పై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులు నిర్మల బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. మానుకోట ఎంపీ కవిత తీవ్రంగా విరుచుక పడ్డారు. సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

విభజన హామీలపై సుదీర్ఘ ఆందోళనకు ఆ పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. మార్చి 17 నుంచి లాంగ్ మార్చ్ చేపట్టేందుకు ఎర్రదండు సిద్ధమైంది. బయ్యారం నుంచి ప్రారంభమయ్యే ఈ లాంగ్ మార్చ్ హైదరాబాదులో ముగించే విధంగా ప్రత్యేక ఆందోళన కార్యక్రమం రూపొందించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కల్లపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్శిటీలను కేంద్రం మరో మారు విస్మరించింది. విభజన హామీలకు కేటాయింపులు జరపకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలలో మూడు ప్రధానమైన అంశాలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో ముడిబడి ఉండటం విశేషం.

బడ్జెట్లో మోడీ ప్రభుత్వ పక్షపాతం

మోడీ ప్రభుత్వం త‌న ప‌క్ష‌పాత బుద్దిని ప్రతీసారీ బ‌య‌ట పెట్టుకుంటూనే ఉన్న‌ది. అన్నిరాష్ట్రాల‌ను స‌మ‌దృష్టితో చూడాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న క‌ర్ణాట‌క‌పై క‌రుణ చూపారు. నీటి పారుద‌ల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేంద్ర ప్ర‌భుత్వ సాయం ప్ర‌క‌టించారు. బిజెపి పాలిత రాష్ట్రాలపై, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వ ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అధికారం కాపాడుకోవడం, అధికారాన్ని కైవసం చేసుకోవడం తప్ప దేశాభివృద్ధి ప్రజల సంక్షేమం సంపద తదితర అంశాలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సెంటిమెంటు, మతతత్వం, ఇతరత్రా విభేదాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి ఎజెండా లేదని పలువురు విమర్శిస్తున్నారు.

ఓరుగల్లుకు మొండి చెయ్యి

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులను కేటాయించలేదు. కనీసం రాష్ట్రప్రభుత్వం చొరవతో ప్రారంభించిన టెక్స్ టైల్ పరిశ్రమ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆజం జాహీ మిల్లు మూత తర్వాత ఇక్కడ టెక్స్ టైల్ పరిశ్రమ గురించి కనీసం పట్టించుకోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పత్తి భారీగా పండిస్తున్నారు.

ఇప్పటికే కాటన్ జిన్నింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందినప్పటికీ దానిని మరో మెట్టెక్కించే చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగం పెరిగిపోతున్నప్పటికీ, ఉపాధి కల్పించే చర్యలు రాష్ట్రం, కేంద్రం నుంచి కానరాకపోవడం శోచనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుద్యోగ యువత నిరాశ చెంది రాజకీయ పార్టీలకు పావులుగా మారుతున్నారు.

వ్యవసాయ రంగానికి శూన్య హస్తం

దేశంలో డిజిటలైజేషన్ పేరుతో కార్పొరేట్ వర్గాలకే పెద్ద పీట వేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా చివరి బడ్జెట్ లోనూ ఉద్యోగ కల్పన మాట మరిచారు. కేంద్ర బడ్జెట్ లో అంకెల గారడీతో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారని విమర్శిస్తున్నారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేదు: ఎంపి కవిత

చేనేత రంగానికి కేంద్రం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వట్లేదని ఎంపీ కవిత విమర్శించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులు ఇస్తారనుకుంటే.. నిరాశే ఎదురైందని తెలిపారు. విద్య, ఆరోగ్యానికి నిధులు కోత కోశారని ఎంపి కవిత ఆవేదన చెందారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ కేటాయించాలని ఎన్నోసార్లు అడిగామని, బడ్జెట్‌లో కేటాయించలేదని మండిపడ్డారు.

ఐటీఐఆర్‌ ఇస్తే దేశానికి కూడా ఎంతో ప్రయోజనం ఉండేదని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, సాగును కేంద్రం బడ్జెట్ లో నిర్లక్ష్యం చేసిందని రూ.45 లక్షల కోట్లలో రూ.15 లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారని, అప్పు తెచ్చిన రూ.15 లక్షల కోట్లలో రూ.11 లక్షల కోట్లు వడ్డీలకే పోతున్నాయని అన్నారు. దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం అందట్లేదని మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఆవేదన చెందారు.

నెల రోజులు సీపీఐ లాంగ్ మార్చ్

విభజన హామీల అమలుకై లాంగ్ మార్చ్ పేరుతో సిపిఐ భారీ పాదయాత్ర చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేర 500 మందితో చేపట్టనున్న ఈ పాదయాత్ర నెల రోజుల పాటు కొనసాగుతుంది. మార్చి 17న మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పాదయాత్ర ప్రారంభమై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 17న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ముగుస్తుంది.

బయ్యారంలో ప్రారంభమై మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆరు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వరంగల్ ఇస్లామియా కాలేజీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, హనుమకొండ కెడిసి గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరు కానున్నారు.

వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం: సిపిఐ రాష్ట్ర నేత శ్రీనివాస్

గడిచిన తొమ్మిదేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాలను తమ పార్టీ చేపట్టే ఈ పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామని సిపిఐ రాష్ట్ర నేత శ్రీనివాస్ చెప్పారు. 2014 నుండి విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం వివక్ష ప్రదర్శించిందని అన్నారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వరంగల్ టెక్స్ టైల్ పరిశ్రమకు నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భూ పోరాటాలు ఉదృతంగా సాగుతున్నాయని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పోడు భూములకు పట్టాలివ్వాలని, సింగరేణి ప్రైవేటీకరణ నిలిపి వేయాలని, సింగరేణి ఆధ్వ‌ర్యంలోనే మైనింగ్ జరుపాలని కోరారు.

జనగామ నుండి హైదరాబాద్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు డిమాండ్లను కూడా పాదయాత్ర ద్వారా ప్రభుత్వాల ముందు ఉంచనున్నామని తెలిపారు. తమ పాదయాత్ర ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలు, కుర్చీల కోసం కాదని, సమస్యల పరిష్కారం కోసమని, ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ది, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కోసమేనని తెలిపారు. కేంద్రం తన బడ్జెట్‌లో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని, విభజన హామీలపై ఇక్కడి బిజెపి నాయకులు స్పందించాలని అన్నారు. ఈ పాదయాత్రను, బహిరంగ సభలను ప్రజలు విజయవంతం చేయాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం: కాంగ్రెస్ నేత నాయిని

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా అభివృద్ధి కుంటుపడిందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.

విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

బిజెపి, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విన్నవించారు.