Warangal | పెద్దికి పెరిగిన మద్ధతు.. సొంత గూటికి చేరిన రాణాప్రతాప్
Warangal | వేలాదిమందితో తిరిగి చేరిక నర్సంపేటలో భారీ ర్యాలీ గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ కు కొత్త బలం చేకూరింది. ఈ సెగ్మెంట్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నియోజకవర్గంలో యువనేతగా గుర్తింపు పొందిన డాక్టర్ గోగుల రాణాప్రతాప్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం […]

Warangal |
- వేలాదిమందితో తిరిగి చేరిక
- నర్సంపేటలో భారీ ర్యాలీ
- గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ కు కొత్త బలం చేకూరింది. ఈ సెగ్మెంట్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నియోజకవర్గంలో యువనేతగా గుర్తింపు పొందిన డాక్టర్ గోగుల రాణాప్రతాప్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆదివారం నర్సంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, సుమారు 2వేల మందితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రాణాప్రతాప్ తిరిగి గులాబీదళంలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, పెద్ది ఘన విజయం ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తిరిగి గులాబీ పార్టీలోకి..
మొదట రాణాప్రతాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లోనూ పెద్ది సుదర్శన్‌రెడ్డి గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ అన్నివర్గాల ప్రజలకు, ప్రధానంగా యువతకు బాగా దగ్గరయ్యారు. అయితే, కొన్ని కారణాల నేపథ్యంలో పెద్దిని విభేదించి ఆయన బీజేపీలో చేరారు. కొంతకాలం బీజేపీలోనూ కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఇటీవల బీజేపీ సమావేశంలో గొడవ జరిగింది. రాణాప్రతాప్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, స్థానిక నేతల తీరుతో విసిగిపోయినట్లు ప్రకటించారు. రాణాప్రతాప్ తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రాణాప్రతాప్ రాకతో నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మారుతుందని అంచనా వేస్తున్నారు.