Rahul Gandhi | రాహుల్‌కు సుప్రీంలో ఊర‌ట‌

Rahul Gandhi ఎంపీ హోదా పున‌రుద్ధ‌ర‌ణ‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌ సూర‌త్ కోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. రాహుల్ గాంధీ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ […]

  • By: krs    latest    Aug 04, 2023 12:46 AM IST
Rahul Gandhi | రాహుల్‌కు సుప్రీంలో ఊర‌ట‌

Rahul Gandhi

  • ఎంపీ హోదా పున‌రుద్ధ‌ర‌ణ‌
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌
  • సూర‌త్ కోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు

న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. రాహుల్ గాంధీ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది.

వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. శిక్షపై స్టే కోరుతూ రాహుల్‌ గాంధీ సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, పీఎస్‌ నరసింహ, సంజయ్‌ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై విచారణ చేప‌ట్టింది.

రాజ‌కీయ ఆరోప‌ణ‌లపై రాహుల్ గాంధీని సూర‌త్ కోర్టు దోషిగా నిర్ధారించడం విస్తృతమైందని, ఇది ఒక వ్యక్తిపైనే కాకుండా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. ట్రయిల్‌ కోర్టు గరిష్ఠ శిక్షను విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. అలాగే మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌ గాంధీకి కూడా సుతిమెత్తగా మంద‌లించింది.

ఏమిటీ కేసు, ఏమా క‌థా..

2019 ఏప్రిల్‌ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగంలో
‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డి దేశం వ‌దిలిపారిపోయిన ల‌లిత్‌మోడీవంటి వారినుద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ రాహుల్ వ్యాఖ్య‌ల‌పై సూరత్‌ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ దావాపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఆ మరునాడు రాహుల్‌పై అనర్హత వేటు వేశారు. జైలు శిక్షపై స్టే కోసం రాహుల్‌ గాంధీ ట్రయల్‌ కోర్టుతోపాటు గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు. అక్క‌డా కిందికోర్టు తీర్పునే స‌మ‌ర్థించ‌డంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదాను పునరుద్ధరించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


మళ్లీ ఎంపీగా పార్లమెంటుకు రాహుల్‌

‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించ‌డంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన లోక్ సభ సచివాలయం నుంచి వ‌చ్చిన మ‌రుక్ష‌ణం నుంచే రాహుల్ పార్ల‌మెంటుకు హాజ‌రుకావొచ్చు.

కాంగ్రెస్‌లో సంబురాలు

పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి విధించిన రేండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై కాంగ్రెస్‌ స్పందించింది. సత్యమేవ జయతే అని ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. “ఈ విజయం ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే.. జై హింద్‌” అని ట్వీట్‌ చేసింది. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు.

ఈ అంశంపై ఈ రోజే లోక్‌సభ స్పీకర్‌కి లేఖ రాసి, మాట్లాడతానని అన్నారు. సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యేందుకు మార్గం సుగమం కావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘‘వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి’’ అంటూ ఆయన ఫొటోతో ఆ పార్టీ ట్వీట్ చేసింది.

నా దారి ర‌హ‌దారి..రాహుల్‌

సుప్రీం తీర్పు త‌రువాత రాహుల్ మీడియాతో మాట్లాడారు. “నా దారి.. రహదారి.. ఎవరు అడ్డొచ్చినా దూసుకుపోవడమే..” అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ తీర్పుపై హ‌ర్షం వ్య‌క్త‌మైంది. గాంధీభ‌వ‌న్‌లో నేత‌లు ట‌పాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.