Supreme Court | మార్గదర్శకాలు ఉల్లంఘించే మేజిస్ట్రేట్లను.. విధుల నుంచి తప్పించి శిక్షణకు పంపుతాం
అనవసర కస్టడీలపై సుప్రీం కోర్టు హెచ్చరిక విధాత: అనవసరంగా వ్యక్తులను కస్టడీకి పంపవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) పునరుద్ఘాటించింది. సతేందర్‌కుమార్ అంతిల్, సీబీఐ(CBI) మధ్య జరుగుతున్న కేసులో ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తన మార్గదర్శకాలు, చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులను కస్టడీలకు పంపే మేజిస్ట్రేట్లను (Magistrates) న్యాయ విధుల నుంచి తప్పించి, నైపుణ్యం పెంచేందుకు శిక్షణ అకాడమీలకు పంపాలని చురకలేసింది. తమ ముందుకు తీసుకొచ్చిన కొన్ని బెయిల్ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. క్షేత్రస్థాయిలో అనేక ఉల్లంఘనలు […]

- అనవసర కస్టడీలపై సుప్రీం కోర్టు హెచ్చరిక
విధాత: అనవసరంగా వ్యక్తులను కస్టడీకి పంపవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) పునరుద్ఘాటించింది. సతేందర్‌కుమార్ అంతిల్, సీబీఐ(CBI) మధ్య జరుగుతున్న కేసులో ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తన మార్గదర్శకాలు, చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులను కస్టడీలకు పంపే మేజిస్ట్రేట్లను (Magistrates) న్యాయ విధుల నుంచి తప్పించి, నైపుణ్యం పెంచేందుకు శిక్షణ అకాడమీలకు పంపాలని చురకలేసింది. తమ ముందుకు తీసుకొచ్చిన కొన్ని బెయిల్ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. క్షేత్రస్థాయిలో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జస్టిస్ ఏ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్ కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. ఈ ఉత్తర్వులన్నీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తూ ఇచ్చినవేనని ధర్మాసనం పేర్కొన్నది. ఇలానే ఉత్తర్వులు ఇచ్చేవారిని న్యాయ విధుల నుంచి తప్పించి, వారి నైపుణ్యం పెంచేందుకు న్యాయ అకాడమీలకు పంపాల్సి వస్తుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇటువంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపింది. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నప్పటికీ వ్యక్తులను కస్టడీకి పంపుతున్నారని, తద్వారా మరింత చిక్కులకు ఆస్కారం ఇస్తున్నారని పేర్కొంది. ఇటువంటివాటిని సహించేది లేదని స్పష్టం చేసింది.
కిందిస్థాయి న్యాయ వ్యవస్థ సంబంధిత హైకోర్టుల పర్యవేక్షణలో పనిచేయాలనేది సుప్రీం కోర్టు అభిప్రాయమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తెలియజేయాలని, తద్వారా ఈ విషయంలో అవసరమైన మార్గదర్శనాలు కింది కోర్టులకు ఇచ్చేందుకు వీలుంటుందని ఉత్తరప్రదేశ్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. సరైన లీగల్ పొజిషన్‌ను సూచించే బాధ్యత కోర్టులపైనే కాదు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్లపైనా ఉంటుందని తెలిపింది. కోర్టులు బెయిల్ మంజూరు చేసే విషయంలో 2021 అక్టోబర్‌లో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది.