Janagama | జనగామ టికెట్ పై సస్పెన్స్.. పెండింగ్ వెనుక పక్కా ప్లాన్

Janagama | పునరాలోచనలో అధిష్టానం ముత్తిరెడ్డికి బుజ్జగింపులా? తిరుగుబాటు చేస్తాడనే భయమా? తొమ్మది సిటింగులకు మళ్ళీ ఛాన్స్ స్టేషన్ ఘన్పూర్ లో మార్పు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఒక్క జనగామ సీటు పై మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కడుగు వెనక్కు వేసినట్లు భావిస్తున్నారు. ఈ సమస్యను ఓపికగా పరిష్కరించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు […]

  • By: krs    latest    Aug 21, 2023 4:56 PM IST
Janagama | జనగామ టికెట్ పై సస్పెన్స్.. పెండింగ్ వెనుక పక్కా ప్లాన్

Janagama |

  • పునరాలోచనలో అధిష్టానం
  • ముత్తిరెడ్డికి బుజ్జగింపులా?
  • తిరుగుబాటు చేస్తాడనే భయమా?
  • తొమ్మది సిటింగులకు మళ్ళీ ఛాన్స్
  • స్టేషన్ ఘన్పూర్ లో మార్పు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఒక్క జనగామ సీటు పై మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కడుగు వెనక్కు వేసినట్లు భావిస్తున్నారు.

ఈ సమస్యను ఓపికగా పరిష్కరించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు భావిస్తున్నారు. మరో వైపు ముత్తిరెడ్డి సోమవారం తెలంగాణ భవన్ కు వెళ్ళడం, దీనికి ముందు ఎమ్మెల్సీ కవితను కలవడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అడుగువేయాలని అధిష్టానం భావించినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా జనగామ సీటు పెండింగ్లో పెట్టి మిగిలిన 11 స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెట్టి, ఎమ్మెల్సీ కడియానికి అవకాశమిచ్చారు. మిగిలిన వాటిలో తొమ్మిది మంది సిటింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు.

పశ్చిమ నుంచి వినయ్, తూర్పు నుంచి నరేందర్, నర్సంపేట నుంచి పెద్ది, వర్ధన్నపేట నుంచి అరూరి, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి, భూపాల్ పల్లి నుంచి గండ్ర, పరకాల నుంచి చల్లా, మహబూబాబాద్ నుంచి శంకర్ నాయక్, డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ల అభ్యర్థిత్వాలను ప్రకటించి చర్చకు తెరలేపారు. ములుగు నుంచి బడే నాగజ్యోతికి టికెటిచ్చారు.

జనగామ పెండింగుకు కారణమేంటీ?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్, జనగామ పై ఉత్కంటకు తెరలేపారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, జనగామలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై నలువైపులా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వపక్షానికి చెందిన ప్రత్యర్థులు, విపక్షపార్టీలు, సొంత కుమార్తె నుంచి వివిధ ఆరోపణలకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ సారి ముత్తిరెడ్డి టికెట్ గల్లంతేననే చర్చసాగింది. ఒక వైపు ఎమ్మెల్సీ పోచంపల్లి ఈ స్థానం పై కొంత కాలంగా కన్నేశారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ పల్లా తెరపైకి వచ్చారు. పల్లా పార్టీలోని కొందరితో రహస్య సమావేశం నిర్వహించడంతో ముత్తిరెడ్డి అమీతుమీకి సిద్ధమయ్యారు. హైదరాబాద్, జనగామలో బలప్రదర్శనకు దిగారు. పల్లాను టార్గెట్ చేశారు.

పరోక్షంగా పోచంపల్లి దీనికి మద్ధతు తెలిపినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ముత్తిరెడ్డికి స్థానికంగా బలమైన వర్గం ఉన్నట్లు పార్టీ గుర్తించినట్లు చెబుతున్నారు. ముత్తిరెడ్డి టార్గెట్ చేసిన పల్లా ను ప్రకటిస్తే పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వస్తుందని భావించినట్లు చెబుతున్నారు. పల్లాను ప్రకటించగానే ముత్తిరెడ్డి తిరుగుబాటు ప్రకటించి సమస్యలు తలెత్తుతాయని భావించినట్లు చెబుతున్నారు.

జనగామలో ఒక్క అడుగు వెనక్కు..

నెమ్మదిగా ముత్తిరెడ్డిని బుజ్జగించిన తదుపరి పల్లాకు అవకాశం ఇవ్వాలా? లేక ముత్తిరెడ్డికే తిరిగి అవకాశం ఇవ్వాలా? అనే పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే తొలి నుంచి ఉద్యమంలో పాల్గొన్న ముత్తిరెడ్డికి అంగబలం, ఆర్థికబలం, సామాజిక బలం కూడా ఉన్నందున ఆచితూచి వ్యవహరించాలని ఒక అడుగు వెనక్కు వేసినట్లు చెబుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ లోపు తెరవెనుక కార్యక్రమాలు చక్కదిద్దుకోవచ్చని భావించినట్లు సమాచారం. ఈ లోపు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను పల్లాకు అనుకూలంగా నయాన, భయానా, ప్రలోభపెట్టి మార్చేందుకు సమయం చిక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధినేత కేసీఆర్ మనోగతం విప్పితే తప్ప విషయమేమిటో బోధపడని పరిస్థితి ఉందంటున్నారు. ఈ సస్పెన్స్ కొద్ది రోజులు తప్పవంటున్నారు.